నంగునూరు, సెప్టెంబర్ 20 : ‘పీఠభూమిలో సిద్దిపేట జిల్లా ఎత్తయిన స్థానంలో ఉన్నది. ఆ దేవుడు ఈ ప్రాంతానికి ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ తీసుకువచ్చాడు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కేంద్ర స్థానంలో సిద్దిపేట ఉన్నది. ఎకడి నుంచైనా సులభంగా ఇక్కడికి ఆయిల్‌పామ్ గెలలను రవాణా చేయవచ్చు. రాబోయే రెండు, మూడేండ్లలో 6 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగుచేసి దేశంలోనే నంబర్ వన్‌గా తెలంగాణను నిలపాలి. రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో నిలవాలనేది మా ఆకాంక్ష’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో నిర్మించిన ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని శనివారం ఆయిల్‌ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డితో కలిసి మంత్రి సందర్శించారు. డ్రైరన్‌ను తిలకించి ముడి పామాయిల్ ఉత్పత్తిని పరిశీలించారు. అనంతరం మంత్రి తుమ్మల మీడియాతో మాట్లాడుతూ…దేశంలో 13 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగవుతున్నట్టు తెలిపారు. ఇందులో పది లక్షల ఎకరాలు తెలంగాణ, ఏపీలోనే సాగవుతుందని చెప్పారు. ప్రతి ఉమ్మడి జిల్లాలో లక్ష ఎకరాల ఆయిల్‌పామ్ సాగు జరగాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని అన్నారు.
దేశంలోనే మొదటి స్థానంలో నిలిచేలా ఫ్యాక్టరీ నిర్మాణం
ప్రపంచస్థాయి టెక్నాలజీని వినియోగించుకొని దేశంలో మొదటి స్థానంలో నిలిచేలా నర్మెట్టలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని నిర్మించామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. త్వరలోనే సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవం నిర్వహించి, ఫ్యాక్టరీ వద్ద రాష్ట్రంలోని లక్షమంది ఆయిల్‌పామ్ రైతులతో సభ నిర్వహిస్తామని చెప్పారు.