కొడంగల్, నవంబర్ 22 : రైతులను ఇబ్బంది పెట్టి ఫార్మా కంపెనీల ఏర్పాటుకు భూసేకరణ చేపట్టే విధానాన్ని ప్రభుత్వం మానుకోవాలని ఐద్వా నేతలు సూచించారు. బాధిత రైతులకు తాము అండగా ఉంటామని ప్రకటించారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ, ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, కార్యదర్శి అరుణజ్యోతి, జిల్లా కార్యదర్శి అనసూయ తదితరులు శుక్రవారం వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని హకీంపేట, పోలెపల్లి, పులిచెర్లకుంట తండా, రోటిబండ తండా, లగచర్ల గ్రామాలను సందర్శించి ఫార్మా భూ బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లగచర్ల ఘటనను తీవ్రంగా ఖండించారు. లగచర్ల గ్రామంలో పోలీసులు అర్ధరాత్రి కరెంటు తీసి తలుపులు కొట్టి దొరికిన మగవాళ్లని స్టేషన్కు తరలించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అన్యాయమని ఎదురు తిరిగిన మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.