హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తేతెలంగాణ) : రైతులకు అండగా నిలిచిన కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అరెస్టు వెనుక ఆయన అన్న, మండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి హస్తం ఉన్నదని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఆరోపించారు. ఒకవేళ ఆయన హస్తం లేకుంటే ఇప్పటి వరకు తన సోదరుడిని ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శనివారం బీఆర్ఎస్ కార్మిక నేత విజయ్‌కుమార్, నాయకులు రవీంద్‌రెడ్డి, శేఖర్, వెంకటయ్య, కృష్ణతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కడా చైర్మన్‌ను పరామర్శించిన వారికి రైతులు, సొంత తమ్ముడిని పరామర్శించే తీరికే లేదా అని ప్రశ్నించారు. 90 ఏండ్ల వయసున్న తల్లి, తమ్ముడి భార్యాబిడ్డల ఆవేదనను పట్టించుకోకపోవడంలో ఔచిత్యమేమిటని నిలదీశారు. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసిన మహేందర్‌రెడ్డి ఆయన సతీమణి సునీత నియోజకవర్గ ప్రజలను ఏం ఉద్దరిస్తారని పేర్కొన్నారు. ఆస్తులను సంపాదించుకోవడం, కాపాడుకోవడంపై ఉన్న ధ్యాస ప్రజా సేవపై లేదని దుయ్యబట్టారు. ఠికాణా లేని ఆయన సీఎం దగ్గర చీఫ్ విప్ పదవి తీసుకొని రాష్ట్రంలో రికాం లేకుండా తిరుగుతున్నారని ఆరోపించారు.
‘బీఆర్ఎస్ హయాంలో సేకరించిన 14 వేల ఎకరాల భూమి ఉండగా, పచ్చని పంట పొలాల్లో ఫార్మా కంపెనీలు ఎందుకు’ అని పైలట్ రోహిత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తొమ్మిది నెలుగా లగచర్ల రైతులు ఫార్మా కంపెనీలు వద్దని మొత్తుకుంటున్నా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తుందని ధ్వజమెత్తారు. భూములు పోతాయనే బాధతోనే రైతులు అధికారులపై తిరగబడ్డారని పేర్కొన్నారు. ఏదో కుట్ర దాగి ఉన్నదని ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని జైలుకు పంపడం అక్రమమని విమర్శించారు.