న్యూఢిల్లీ, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇచ్చినట్టు నిరూపిస్తే బీఆర్ఎస్ ఎంపీలంతా రాజీనామాకు సిద్ధమని లోక్‌సభలో బీఆర్ఎస్ పక్షనేత ఎంపీ నామా నాగేశ్వర్రావు సవాల్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 86 వేల కోట్లు ఇచ్చామంటూ పార్లమెంట్లో అబద్ధాలు చెప్పిన కేంద్రం, అదే పార్లమెంట్లో తప్పు ఒప్పుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం ఆయన పార్లమెంట్ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎంపీలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు ఇచ్చామంటూ సభను తప్పుకోవ పట్టించినందుకు రూల్ 222 కింద బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబేపై స్పీకర్‌కు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చామని వెల్లడించారు. బీజేపీ సర్కారుకు దమ్ము, ధైర్యం ఉంటే కాళేశ్వరానికి ఎంత ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు అనుమతులు, క్లియరెన్స్‌లు ఇవ్వకుండా చాలాకాలంపాటు సతాయించారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు అయిన ఖర్చు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని, కేంద్రం ఒక రూపాయి కూడా ఇవ్వలేదని పునరుద్ఘాటించారు. ఆదినుంచీ తెలంగాణపై కేంద్రం కక్ష సాధిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ర్టానికి హక్కుగా రావాల్సిన నిధులను కూడా ఇవ్వడంలేదని మండిపడ్డారు. గత తొమ్మిదేండ్లలో తెలంగాణకు ఒక మెడికల్ కాలేజీ కానీ, నవోదయ సూల్ కానీ, ఒక్క ప్రాజెకుకు కూడా జాతీయహోదా ఇవ్వలేదని మండిపడ్డారు. కులాలు, మతాల మధ్య చిచ్చులు పెట్టే వారిని తెలంగాణ ప్రజలు దరిదాపులకు కూడా రానివ్వవద్దని కోరారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై నిశికాంత్ పార్లమెంట్‌కు తప్పుడు సమాచారం ఇచ్చారని ఎంపీ రంజిత్‌రెడ్డి మండిపడ్డారు. దేశాభివృద్ధికి సహకారం అందిస్తున్న తెలంగాణ గురించి కూడా ఆర్థికమంత్రి పార్లమెంట్‌కు చెప్పాలని డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మానుకోవాలని హితవు చెప్పారు. కేసీఆర్‌కి పిండం పెడతా అంటావా.. రేవంత్‌రెడ్డీ ఖబడ్దార్ అని హెచ్చరించారు.
కాళేశ్వరం నిధుల విషయంలో బీజేపీ ఎంపీ నిశికాంత్ ఉద్దేశపూర్వకంగా సభను తప్పుదారి పట్టించారని పేర్కొంటూ నామా నాగేశ్వరరావు స్పీకర్‌కు ప్రివిలేజ్ మోషన్ నోటీసు ఇచ్చారు. నిశికాంత్ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమని, సభను తప్పుదోవ పట్టించడం, సభ్యులను నమ్మించే ప్రయత్నం చేయడమేనని నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసు అందించినవారిలో ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాలోత్ కవిత, రంజిత్‌రెడ్డి, పోతుగంటి రాములు, బీబీ పాటిల్, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్ నేత, పసునూరి దయాకర్ తదితరులు ఉన్నారు.
దేశంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నదని రాజ్యసభలో బీఆర్ఎస్ పక్షనేత కే కేశవరావు పేర్కొన్నారు. తెలంగాణకు సహాయం చేస్తున్నట్టు కేంద్రం అబద్ధాలు చెప్తున్నదని, కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇచ్చినట్టు బీజేపీ ఎంపీ నిశికాంత్దుబే లోక్‌సభలో చెప్పడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఇవ్వని నిధులు ఇచ్చినట్టు అబద్ధాలు చెప్పిన నిశికాంత్దుబేపై స్పీకర్‌కు సభాహక్కుల నోటీసు ఇచ్చినట్టు తెలిపారు.