హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పాలన అందించాలని ధ్యేయంగా పెట్టుకున్నదని సమాచార, పౌరసంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అన్నిశాఖల్లో ఏఐ ద్వారానే పనులు జరిగేలా చూడనున్నట్టు చెప్పారు. భూసర్వే, భూసెటిల్మెంట్లు, రెవెన్యూ, హౌజింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఇలా అన్నీ కూడా ఉత్తమమైన ఏఐ ద్వారానే నిర్వహిస్తామని వ్యాఖ్యానించారు.
ప్రజలకు పనికొచ్చే విధంగా ఏఐని ఉపయోగించాలని నిర్ణయించామని తెలిపారు. అన్ని శాఖల్లో ఏఐ ద్వారానే పనులు జరగాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారని పొంగులేటి చెప్పారు. ఏఐ ఆధారిత పాలనను అందించేందుకు అధికారులు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం తాము వినియోగిస్తున్న ఏఐ కేవలం స్వల్పమేనని, ఇంకా చాలా వినియోగించాల్సి ఉన్నదని తెలిపారు.