
హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రజలకు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేషన్ల ద్వారా మెరుగైన సేవలు అందిస్తామని, వాటిని అభివృద్ధి పథంలో నడిపిస్తామని బుధవారం బాధ్యతలు స్వీకరించిన మూడు కార్పొరేషన్ల చైర్మన్లు పేర్కొన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు సమక్షంలో తెలంగాణ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా గజ్జెల నగేశ్, తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ (టీఎస్టీఎస్) చైర్మన్‌గా పాటిమీది జగన్మోహన్రావు, తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా క్రిశాంక్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, వీ శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, టీఎస్‌టీడీసీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, మైనంపల్లి హన్మంతరావు, ఎమ్మెల్సీలు ప్రభాకర్‌రావు, శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీశ్‌రెడ్డి, బీసీ కమిషన్ సభ్యులు కిశోర్‌గౌడ్, ఉపేందర్, శుభప్రద పటేల్, టీఎస్ఎండీసీ ఎండీ మల్సూరు తదితరులు పాల్గొని, అభినందించారు.
అభివృద్ధి పథంలో నడిపిస్తా
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా నాకు ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తా. రాష్ట్రంలో అనేక రకాల ఖనిజాలు ఉన్నాయి. వాటిని రాష్ర్టాభివృద్ధికి వినియోగించుకొనే విధంగా చిత్తశుద్ధితో కృషిచేస్తా. సంస్థను అభివృద్ధి పథంలో నడిపేందుకు నా వంతు కృషి చేస్తా. రాష్ట్ర ఏర్పాటుకు ముందు రూ.37 కోట్లు మాత్రమే ఉన్న సంస్థ ఆదాయం తెలంగాణ ప్రభుత్వ పారదర్శక విధానాల కారణంగా రూ.4,500 కోట్లకు పెరిగింది.
-క్రిశాంక్, ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్
మరింత వన్నె తెస్తా
సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సూచనల ప్రకారం పనిచేసి, ప్రజలకు ఐటీ ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తా. అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో టీఎస్టీఎస్కు మరింత వన్నె తెస్తా. ముఖ్యమంత్రి నాపై ఉంచిన బాధ్యతను వమ్ము చేయకుండా పనిచేస్తా.
-పాటిమీది జగన్మోహన్రావు, తెలంగాణ స్టేట్ టెక్నాలజీ
సర్వీసెస్ చైర్మన్సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటా
ఉద్యమకాలంలో తనతో కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరినీ ముఖ్యమంత్రి కేసీఆర్ గుండెలకు హత్తుకొంటున్నారు. నాపై నమ్మకంతో చైర్మన్‌గా అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటా. నాకు అండగా నిలుస్తున్న మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్‌కుమార్‌కు కృతజ్ఞతలు.
-గజ్జెల నగేశ్, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్
‘బయాలాజికల్ ఈ’కి మంత్రి కేటీఆర్ అభినందన
భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్ తర్వాత తెలంగాణ నుంచి మరో కొవిడ్ వ్యాక్సిన్ కార్బెవాక్స్ ఉత్పత్తి కావడం సంతోషంగా ఉన్నదని పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ హర్షం ప్రకటించారు. ఈ వ్యాక్సిన్ తయారుచేసిన బయాలాజికల్ ఈ సంస్థ ఎండీ, సీఈవో మహిమా దాట్లను మంత్రి ట్విట్టర్లో అభినందించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ సంస్థ నెలకు 100 మిలియన్ టీకా డోసులు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది.