రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ విధానం ఏమిటో స్పష్టం చేయాలి. షరతులు లేకుండా ఎకరానికి రూ.7,500 చొప్పున రైతు భరోసా నిధులు విడుదల చేయాలి. ఎన్నికల కోడ్ ముగిసింది కాబట్టి ప్రజా సమస్యలు, రైతు సమస్యలపై దృష్టి పెట్టాలి. జనుము, జీలుగ, పచ్చిరొట్ట విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచాలి.
– హరీశ్‌రావు
సిద్దిపేట అర్బన్, జూన్ 9: అన్నదాతకు తక్షణమే రైతు భరోసా కింద పంట పెట్టుబడి సాయం అందించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కెనపల్లి గ్రామంలో ఆదివారం ఆయిల్‌పామ్ రైతులు మొదటి పంట గెలలు కోసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల పంట బోనస్ అమలు కోసం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో రైతుల తరఫున బీఆర్ఎస్ పోరాడుతుందని పేర్కొన్నారు. వానకాలం వచ్చినా పంట పెట్టుబడి సాయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించడమే లేదని విమర్శించారు.
రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ విధానం ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి షరతులు లేకుండా ఎకరానికి రూ.7,500 చొప్పున రైతు భరోసా నిధులు విడుదల చేయాలని కోరారు. ఎన్నికల కోడ్ ముగిసినందున ప్రజా సమస్యలపై, రైతు సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. జనుము, జీలుగ, పచ్చిరొట్ట విత్తనాలు దొరకడం లేదని రైతులు ఆందోళనకు దిగుతున్నారని, వ్యవసాయం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదని విమర్శించారు. వెంటనే రాష్ట్రమంతా పచ్చిరొట్ట వ్తితనాలు, ఎరువుల కొరత రాకుండా అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
ఆయిల్‌పామ్ రైతుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం క్రాప్ మెయింటెనెన్స్ కింద సంవత్సరానికి రూ.4,200 చొప్పున పామాయిల్ రైతులకు ఇచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిలిపివేసిందని తెలిపారు. వెంటనే ఆ నిధులను విడుదల చేయాలని, డ్రిప్ కంపెనీలకు ఇవ్వాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన విధంగా మొక్కల కోసం ఇచ్చే సబ్సిడీని విడుదల చేయాలని కోరారు. పామాయిల్‌కు కస్టమ్ డ్యూటీని పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కండ్లు తెరవాలని హరీశ్‌రావు హితవు పలికారు. రైతులు పండించిన అన్నిరకాల వడ్లకు క్వింటాకు రూ.500 చొప్పున పంట బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బోనస్‌పై మంత్రులు తలోమాట మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అన్నిరకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని, రైతులను దగా చేయవద్దని కోరారు. అక్కెనపల్లిలో పామాయిల్ రైతులు మొదటి మొక్కను తనతోనే నాటించారని, మొదటి గెలను కూడా తనతోనే తీయించడం సంతోషంగా ఉన్నదని హరీశ్‌రావు సంతృప్తిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాధాకృష్ణశర్మ, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు కోల రమేశ్‌గౌడ్, మహిపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు లింగంగౌడ్, ఎడ్ల సోమిరెడ్డి, వెంకట్‌రెడ్డి, కిష్టారెడ్డి, సారయ్య, మల్లయ్య పాల్గొన్నారు.