హైదరాబాద్, ఏప్రిల్ 7(నమస్తే తెలంగాణ) : యాసంగిలో 148 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి రానుండగా, ఇందులో 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టంచేశారు. ఇందుకోసం 8,251 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ధాన్యం విక్రయించిన రెండు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పారు. ఈ మేరకు మంగళవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుకు 16 కోట్లకు పైగా గన్నీ బ్యాగులు సిద్ధం చేసినట్టు తెలిపారు. సాధారణ రకానికి క్వింటాకు రూ.2,369, సన్నాలకు రూ.2,389 మద్దతు ధర చెల్లించనున్నట్టు చెప్పారు.