హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సుమారు రూ.18,250 కోట్ల అంచనా విలువతో చేపట్టనున్న వానకాలం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీ కార్యాచరణ అమలు చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
శనివారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో అదనపు కలెక్టర్లు, జిల్లా పౌర సరఫరాల అధికారులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత వానకాలం మారెటింగ్ సీజన్ (2026-27)లో 65 లక్షల టన్నుల (45 లక్షల టన్నుల సన్నరకాలు, 20 లక్షల టన్నుల దొడ్డురకాలు) ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా 8,283 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, అక్టోబర్ 1 నాటికే అన్ని కేంద్రాలను సిద్ధం చేయాలని, 15 నుంచి కొనుగోళ్లు ప్రారంభించాలని స్పష్టం చేశారు. కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధరకు (గ్రేడ్-ఏ రూ.2,461, సాధారణం రూ.2,441) అదనంగా, రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయంగా ఎంపిక చేసిన 7 రకాల సన్న ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లిస్తుందని ఉత్తమ్ వెల్లడించారు. ధాన్యం విక్రయించిన వెంటనే నగదు వారి ఖాతాల్లో జమ కావాలని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.