హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): ‘ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్లోని డీఏలను తక్షణం చెల్లిస్తాం. సప్లిమెంటరీ బిల్లులను 15 పనిదినాల్లో చెల్లిస్తాం’ ఇదీ కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉద్యోగులకిచ్చిన హామీ. అధికారంలోకి వచ్చి 10 నెలలైనా ఒకేఒక్క డీఏను విడుదల చేసింది. పాత బకాయిలను ఏక మొత్తంలో కాకుండా, 17 సమాన వాయిదాల్లో చెల్లిస్తామని తెలిపింది. ఈ ఐదు డీఏలు విడుదలైతే ఉద్యోగులకు నెలకు కనిష్ఠంగా రూ.8వేల నుంచి గరిష్ఠంగా రూ. 20 వేల వరకు అందుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కరువుభత్యం 3.64% పెంచుతూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. 2025 మార్చి 31లోపు పదవీ విరమణ చేసే ఉద్యోగుల డీఏ బకాయిలను 17 సమాన వాయిదాల్లో చెల్లించనున్నట్టు తెలిపింది. సీపీఎస్ ఉద్యోగుల డీఏ బకాయిల్లో 10% ప్రాన్ఖాతాకు జమచేస్తారు. మిగతా 90 శాతాన్ని 2025 ఫిబ్రవరి నుంచి 17 సమాన వాయిదాల్లో చెల్లిస్తారు. పెన్షనర్ల డీఏ బకాయిలను 2025 జనవరి నుంచి 17 వాయిదాల్లో చెల్లించనున్నట్టు తెలిపిం ది. డీఏ మొదటి ఇన్స్టాల్మెంట్ను జనవరిలో బిల్లు చేస్తే ఫిబ్రవరి 1న పొందుతారు.
పెంచిన డీఏ 2022 జూలై ఒకటో తేదీ నుంచి వర్తిస్తుందని ప్రభుత్వం జీవోలో తెలిపింది. ఇదివరకు డీఏ 22.75% ఉండగా, పెరిగిన దానితో కలిపి 26.39 శాతానికి చేరింది. 2022 జూలై 1 నుంచి 2024 అక్టోబర్ 31 వరకు (28 నెలల) డీఏ బకాయిలను జీపీఎఫ్ ఖాతాల్లో జమచేస్తారు. ఇప్పుడిచ్చిన డీఏను మినహాయి స్తే నాలుగు డీఏలు పెండింగ్లో ఉండగా, ఈ డిసెంబర్లో మరో డీఏ బకాయిల జాబితాలో చేరుతుంది. దీంతో పెండింగ్ డీఏల సంఖ్య మళ్లీ ఐదుకు చేరుతుంది.
సీపీఎస్ ఉద్యోగుల డీఏ బకాయిలను 17 వాయిదాల్లో చెల్లించడం సరికాదని సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాముక కమలాకర్ అభ్యంతరం వ్యక్తంచేశారు.