ఆదిబట్ల, జనవరి 10: మా ప్రాణం పోయినా ఫోర్త్ సిటీకి మా భూములు ఇవ్వం, మీరు బలవంతంగా రోడ్డు వేయాలంటే మా శవాల మీదుకెళ్లి రోడ్డు వేయాలి అని ఫోర్త్ సిటీ గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులు హెచ్చరించారు. శుక్రవారం ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగరకలాన్‌లో ఇబ్రహీంపట్నం డిప్యూటీ తహసీల్ధార్ శ్రీనివాస్, ఆర్ఐ పుష్పలత గ్రామ సభ ఏర్పాటు చేసి అభిప్రాయాలు సేకరించారు. భూముల జోలికి రావద్దు అని రైతులు తెగేసి చెప్పారు. 330 ఫీట్ల రోడ్డుతో ఊరికి ఎలాంటి ఉపయోగం లేదని, భూములు కోల్పోతున్న వారికి 2013 భూసేకరణ సవరణ చట్టం ప్రకారం పరిహరం ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం హైవేను 6 లైన్ల రోడ్డుగా మార్చాలని సూచించారు.
ఆయకట్టుకు నీళ్లివ్వాలని ఆందోళన ; చొప్పదండి తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతుల నిరసన
చొప్పదండి, జనవరి 10 : కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రేవెల్లి మినీ ట్యాంక్ బండ్ నుంచి రాగంపేట, రేవెల్లి, చిట్యాలపల్లి గ్రామాల ఆయకట్టుకు నీరందించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తహసీల్ కార్యాలయం ఎదుట రైతులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎల్లంపల్లి పైపులైన్ నుంచి మినీ ట్యాంక్ బండ్ చెరువుకు పుషలంగా నీరు వచ్చేదని, దాని ద్వారా ఆయకట్టుకు ఇచ్చేదని గుర్తు చేశారు. ప్రస్తుతం చెరువులో నీరు లేదని, ఉన్న కొద్దిపాటి నీటిని పై గ్రామాలకు చెందిన రైతులు మోటర్లు పెట్టుకొని పంపింగ్ చేసుకోవడంతో కింది గ్రామాలకు నీరందక పంటలు, చేపలు చేపలు చనిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. అనంతరం తహసీల్దార్ నవీన్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.