హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): ఆర్థిక మోసాలకు పాల్పడిన నౌహీరాషేక్‌కు సంబంధించిన భూ ముల వేలం నిలిపివేయాలంటూ అదేపనిగా పిటిషన్లు వేయడాన్ని హైకోర్టు ఆక్షేపించింది. 2019లో ఈడీ జప్తుచేసిన ఆస్తులను ఆ తర్వాత ఎలా కొనుగోలు చేస్తారని ప్రశ్నించింది. ఆ భూములను నిషేధిత జాబితాలో చేర్చితే సమస్యలు ఉండవని అభిప్రాయపడింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం అల్లూరులోని 10.11 ఎకరాల భూమిని ఈడీ వేలం వేయడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్ నానక్‌రామ్‌గూడకు చెందిన షేరాజ్ ఇతరులు వేసిన పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక ఇటీవల విచారణ జరిపారు. నౌహీరాషేక్ నుంచి తాము కొనుగోలు చేసిన భూ ములను తమ పేరిట రిజిస్ట్రేషన్ చేసేలా చేవెళ్ల సబ్‌రిజిస్ట్రార్‌ను ఆదేశించాలని కోరారు. వాదనలపై హైకోర్టు.. 2019లో ఈడీ జప్తు చేసిన భూములను ఎలా కొనుగోలు చేస్తారని ప్రశ్నిస్తూ.. పిటిషన్‌ను కొట్టివేసింది.