హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ఈ నెల 7న వాహన బంద్ జరిపేందుకే తెలంగాణ ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్ల జేఏసీ నిర్ణయించింది. బంద్‌ను విరమించుకోవాలన్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వినతిని జేఏసీ తిరస్కరించింది. హామీలను ప్రభుత్వం విస్మరించిందని తేల్చిచెప్పింది. ఈ నెల 6న ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారంపై మరోసారి చర్చలు జరుపుతామని మంత్రి చెప్పారని జేఏసీ నేతలు వెల్లడించారు. ఈ చర్చల్లో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొంటారని చెప్పినట్టు తెలిపారు. చర్చలు సఫలమైతేనే బంద్ విరమించుకుంటామని జేఏసీ నాయకులు వేముల మారయ్య, ఏఐటీయూసీ బీ. వెంకటేశం, ఐఎఫ్టీయూ ప్రవీణ్, టీఏడీయూ సత్తిరెడ్డి, సిటీ ఆటో యూనియన్ అధ్యక్షుడు సలీం తెలిపారు. తెలంగాణ ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్ల జేఏసీ ఈ నెల 7న ఇచ్చిన వాహన బంద్ పిలుపు సర్కార్‌కు దడ పుట్టించింది. ఇప్పటికే డ్రైవర్లందరూ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డ్రైవర్ల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. మహిళలకు ఉచిత బస్సు పథకంతో రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారు. ఈ నేపథ్యంలో సుమారు 50 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న ఆటో డ్రైవర్ల వివరాలతో ‘ఆటో డ్రైవర్ల సూసైడ్ రిపోర్ట్’ అన్న పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. మృతుల వివరాలు, వార్తల పేపర్ క్లిప్పింగులు, టీవీ చానెళ్ల వీడియోలను జత చేస్తూ ఆధారాలను నెటిజన్లు షేర్ చేస్తున్నా చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.