ముంబై, జనవరి 11 (నమస్తే తెలంగాణ): డబ్బు చెల్లించలేదని మృతదేహాన్ని 8 గంటలకు పైగా మార్చురీలో ఉంచిన ఒక దవాఖాన నిర్వాకం ఇది. ఒక మహిళా జర్నలిస్టు తండ్రి ముంబైలోని ఛారిటీ హాస్పిటల్ మసినాలో చికిత్స పొందుతూ మరణించారు. అయితే బిల్లు చెల్లించలేదన్న సాకుతో ఆయన మృతదేహాన్ని దవాఖాన యాజమాన్యం మార్చురీకి తరలించి 8 గంటలకు పైగా ఉంచింది. మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ప్రకాశ్ అబితర్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. జనవరి 8న మసీనా ఛారిటీ దవాఖానలో మహేశ్ భలేరావు చేరారు. చికిత్స పొందుతూ జనవరి 10న మరణించారు. అయితే మృతదేహాన్ని వెంటనే అప్పచెప్పకుండా డబ్బు, పత్రాల ప్రక్రియ పేరుతో యాజమాన్యం ఆమె కుమార్తెను 8 గంటల పాటు ముప్పుతిప్పలు పెట్టారు. దవాఖాన ట్రస్టీ కవితాపాయ్ను కలవడానికి చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. అంతకుముందు, జనవరి 9న శస్త్రచికిత్స కోసం ఆమె రూ.3 లక్షలు చెల్లించారు.