హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంచి, ఉపాధి చూపించి ఆర్థిక దన్ను కల్పించాల్సిన కార్పొరేషన్లు నిర్వీర్యం అవుతున్నాయి. నిధుల్లేక, పాలవకర్గాలూ లేక, కార్యాలయాలు అసలే లేక నీరసించిపోతున్నాయి. చేయూతను అందించాల్సిన ప్రభుత్వం చేతులెత్తేయడంతో ఆ సహకార సంస్థలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. సంక్షేమ పథకాల అమలును పర్యవేక్షించాల్సిన ఆ కార్పొరేషన్లు కేవలం ప్రణాళికలకే పరిమితమవుతున్నాయి. వీటి ఉనికి ప్రశ్నార్థకంగా మారడంతో వెరసీ రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారుతున్నాయి. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, యువతకు రాయితీపై రుణాలు మంజూరు చేసి, నైపుణ్యాభివృద్ధిని పెంచి దారిచూపే సమున్నత లక్ష్యంతో కేసీఆర్ సర్కారు 17 ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటుచేసింది. దళితబంధు, బీసీ బంధుతోపాటు యువత స్వయం ఉపాధి యూనిట్లకు నిధులు మంజూరు చేసింది. దీంతో ఆనాడు కొత్త రాష్ట్రమైనా ఎంతోకొంత ఆర్థిక పరిపుష్ఠి కల్పించి ఊపిరూలూదింది. సంక్షేమ పథకాల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించింది. రెండేండ్ల కిందట గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా మరో 13 కార్పొరేషన్లను ఏర్పాటుచేసింది. కానీ బడ్జెట్లో నిధులు కేటాయించడం, విడుదల చేయకుండా విమర్శను మూటగట్టుకున్నది.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా యువతకు ఉపాధి కల్పనకు హామీ ఇచ్చింది. యువ వికాసం పథకం కింద 5 లక్షల మందికి యువతకు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రాయితీ రుణాలు అందిస్తామని ప్రకటించింది. ఇందుకు 6,000 కోట్లు కేటాయించినట్టు ఘనంగా చెప్పుకొన్నది. 2024 ఫిబ్రవరి, మార్చిలో దరఖాస్తులు స్వీకరించింది. సుమారు 16 లక్షల దరఖాస్తులు రాగా, అర్హులను ఎంపిక చేసి తెలంగాణ ఆవిర్భావ దినమైన 2024 జూన్ 2న రుణమంజూరు పత్రాలను పంపిణీ చేస్తామని ఆర్భాటం చేసింది. కానీ అంతలోనే వెనక్కి తగ్గి, ఆచరణలో చేతులెత్తేసింది. 19 నెలలు దాటినా ఆ ఊసే ఎత్తడం లేదు. దీంతో కార్పొరేషన్లను పరిపుష్ఠం చేస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్.. ఆచరణలో విఫలమైందని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు మండిపడుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్సీ, మైనారిటీ శాఖల కింద వివిధ సహకార సంస్థలను ఏర్పాటుచేశారు. బీసీ సంక్షమ శాఖ కింద బీసీ కార్పొరేషన్‌తోపాటు ఎంబీసీ, రజక, నాయీబ్రాహ్మణ, కల్లుగీత, వడ్డెర, సగర, వాల్మీకి/బోయ, భట్రాజు, మేర, మహేంద్ర, శాలివాహన, పెరిక, విశ్వబ్రాహ్మణ, పూసల, ముదిరాజ్, గంగపుత్ర కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వీటిలో కేవలం 5 సహకార సంస్థలకే కార్యాలయాలు, చైర్మన్లు, పాలకవర్గాలు ఉన్నాయి. మిగతా వాటికి కనీసం నిలువనీడ కూడాలేదు. ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో ఎస్సీ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో మాలలు, మాదిగలకు వేర్వురుగా కార్యాకలాపాలు నిర్వహిస్తామని ఉత్తర్వులు ఇచ్చారు. కానీ ఆచరణలో మాత్రం ప్రభుత్వం విఫలమైంది. ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలోని ట్రైకార్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజించారు. ఇందులో లంబడాల కోసం సంత్ సేవాలాల్ లంబడా, ఆదీవాసీలకు కుమ్రం భీం కార్పొరేషన్, ఎరుకలకు ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కేవలం ఎస్సీ కార్పొరేషన్‌కు మాత్రమే కార్యాలయం ఏర్పాటుచేశారు. మిగతా వాటి ఉనికి లేదు. మైనార్టీ సంక్షేమ శాఖ పరిధిలో ఒకే కార్పొరేషన్ ఉండగా ముస్లింలు, క్రిస్టియన్లకు వేర్వేరు కార్యాకలపాలు నిర్వహిస్తామని ప్రకటించారు. కానీ ఆ దిశగా అడుగు ముందుకు పడలేదు. దివ్యాంగుల శాఖ పరిధిలో దివ్యాంగుల కార్పొరేషన్, వెల్ఫేర్‌బోర్డు, మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో మహిళా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు.
బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఆర్యవైశ్య కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ సర్కార్ తొలుత ఉత్తర్వులు జారీచేసింది. 2024 మార్చిలో చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ క్రియాశీలక నాయకురాలు కాల్వ సుజాతను నియమించింది. ఈ సంస్థ ద్వారా ఆర్యవైశ్యులకు సంక్షేమ ఫలాలు అందిస్తామని ఆర్భాటంగా ప్రకటించింది. కానీ నాటి నుంచి ఇప్పటివరకు ఈ కార్పొరేషన్ ద్వారా ఎలాంటి కార్యాకలపాలు నిర్వహించలేదు. కనీసం ఏ ఒక్కరోజూ సమావేశం నిర్వహించిన దాఖాలాలూ లేవు. కానీ చైర్మన్‌కు మాత్రం ఏటా సుమారు రూ. 50 లక్షలు వేతన భత్యాల కింద అందజేస్తున్నారు. కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం నయాపైసా మేలు చేయలేదని ఆర్యవైశ్యులు పెదవివిరుస్తున్నారు. కేవలం రాజకీయ పునరావాస కేంద్రంగానే ఈ ఫెడరేషన్‌ను నెలకొల్పారని మండిపడుతున్నారు.