హుస్నాబాద్, మార్చి 8: ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో రూ.2 కోట్లతో చేపట్టే బస్టాండ్ ఆధునీకరణ పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ వచ్చేలోగా ఉద్యోగుల పాత బకాయిలను చెల్లించేందుకు జీవో తీసుకొస్తామని ప్రకటించారు. ఆర్టీసీలోని 50 వేల మంది ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని తెలిపారు. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటివరకు 26 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని తెలిపారు. ప్రస్తుతం వంద శాతం ఆక్యుపెన్సీ వస్తున్నదని చెప్పారు. ప్రయాణీకులకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచడంతోపాటు కొత్త బస్టాండ్ల నిర్మాణం కూడా చేపడుతామని అన్నారు.