Kavitha | ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని 8 మంది అధికారులు శుక్రవారం సోదాలు చేశారు. తనిఖీల అనంతరం ఆమెను మనీలాండరింగ్ కేసులో కవితను శుక్రవారం సాయంత్రం 5.20 గంటలకు అరెస్టు చేశామని ప్రకటించారు. అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ పేరుతో ఈ ప్రకటన విడుదల చేశారు.
“మనీల్యాండరింగ్ నిరోధక చట్టం -2002 కింద కల్వకుంట్ల కవిత నేరానికి పాల్పడినట్లు తమ వద్ద కారణాలు ఉన్నాయని అరెస్ట్ ఆర్డర్లో అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ పేర్కొన్నారు. మనీలాండరింగ్ చట్టంలోని సెక్షన్ 19(1) కింద అన్ని ఆధారాల మేరకు కవితను అరెస్టు చేస్తున్నామని తెలిపారు. అరెస్టుకు గల కారణాలను వివరిస్తూ 14 పేజీలతో కూడిన రిపోస్టును కవితకు కూడా అందజేశామని ఆ నోటీసులో పేర్కొన్నారు.
కవిత అరెస్టును అక్రమ అరెస్టుగా అభివర్ణించిన గులాబీ నేతలు న్యాయపరంగా, శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కొంటామని తెలిపారు. అరెస్టుని అడ్డుకోవద్దని, పార్టీ కార్యకర్తలు శాంతియుతంగా వ్యవహరించాలని కేటీఆర్, హరీశ్ రావు, ఇతర పార్టీ సీనియర్ నాయకులు కోరారు.