హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో బీసీ కులగణనకు చట్టబద్ధత కల్పించే అంశంపై చర్చిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో బుధవారం బీసీ నాయకులు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, వైస్ ప్రెసిడెంట్ జీ నిరంజన్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌తో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడుతామని పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రకటించారని, సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల బీసీ కులగణనకు ఆదేశించారని చెప్పారు.
బీసీ సంఘాలు, మేధావుల నుంచి బీసీ కులగణనపై సలహాలు, సూచనలు స్వీకరించనున్నట్టు తెలిపారు. కులగణన శాస్త్రీయంగా జరగడానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. విద్యార్థుల మెస్‌చార్జీల విడుదలలో జాప్యం జరగకుండా గ్రీన్ చానల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. శానససభ్యురాలు కాని ఎమ్మెల్సీ కవిత.. శాసనసభ ఆవరణలో ఫూలే విగ్రహ ఏర్పాటుపై రాజకీయం చేయడం తగదని పేర్కొన్నారు.