సూర్యాపేట, నవంబర్ 22 : జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాల్లో ఏ సమయంలోనైనా ఆకస్మిక తనిఖీలు చేస్తానని, వసతి గృహాల్లో ఎలాంటి సమస్యలు కనిపించినా చర్యలు ఉంటాయని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ హెచ్చరించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం సంక్షేమ అధికారులు, ఆర్డీఓలు, తాసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంఈఓలు, హెచ్ఎంలతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాల్లో మెస్ కమిటీలు వెంటనే ఏర్పాటు చేయాలన్నారు.
సంక్షేమ అధికారులు వసతి గృహాలకు కావాల్సిన నిత్యావసర సరుకులు, కూరగాయలు , బియ్యం వంటివి తప్పకుండా మెస్ కమిటీకి చూపించి రిజిస్టర్లలో వారి సంతకం చేపించాలని తెలిపారు. అందుకు రెండు రిజిస్టర్లు పెట్టాలని ఆదేశించారు. వసతి గృహాల్లో వంటశాలతోపాటు వాటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు.
తాగునీటిని పరీక్షకు పంపించాలని వసతి గృహ నిర్వాహకులకు సూచించారు. అద్దె బిల్డింగ్‌లో ఉన్న వసతి గృహాల యాజమానులు ఐదు శాతం పరిశుభ్రతకు నిధులు కేటాయించాలన్నారు. ప్రతి విద్యార్థికి ఆరోగ్య పరీక్షలు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అన్ని మండలాల్లోని స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించాలని తాసీల్దార్లకు సూచించారు. ఈసమావేశంలో అదనపు కలెక్టర్ రాంబాబు, డీఎస్ఓ రాజేశ్వర్, డీఈఓ అశోక్, సివిల్ సప్లయ్ డీఎం ప్రసాద్, సంక్షేమ అధికారులు శంకర్, లత, జగదీశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.