మెదక్ : రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులకు ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను(Paddy Purchase centres) అధికారులు ఏర్పాట్లు చేయాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి(Padma Devendar reddy) అన్నారు. బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలో యాసంగి -2023 ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అధికారులు, రైస్ మిల్లర్ల(Rice Millars)తో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు.
రైతు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని భావించే సీఎం కేసీఆర్(CM KCR) రైతులపట్ల మక్కువతో ఉచిత విద్యుత్(Free Power), సాగు నీరు, రైతు బంధు( Raitu Bandu)ను అందిస్తున్నారని వెల్లడించారు. ప్రభుత్వం దళారీల ప్రమేయం లేకుండా కనీస మద్దతు చెల్లిస్తూ రైతులకు భరోసా, ధైర్యం కల్పిస్తున్నదని అన్నారు. అధికార యంత్రాంగం రైతులకు ఇబ్బంది కలగకుండా సంబంధిత శాఖలు సమష్టిగా పనిచేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలలో అవసరమైన కాంటాలు, తేమను కొలిచే యంత్రాలు, ప్యాడి క్లీనర్లు(Paddy Cleaners), టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు.
జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ఈ యాసంగిలో 4 లక్షల 43 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం విపణిలోకి వచ్చే అవకాశముందని, అందుకనుగుణంగా పాక్స్, ఐకేపీ, డీసీఎంఎస్, రైతు ఉత్పత్తి సంస్థల ఆధ్వర్యంలో 406 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
జిల్లాలో 35 బాయిల్డ్ రైస్ మిల్లులకు ధాన్యం తరలించే విధంగా కొనుగోలు కేంద్రం నుంచి మిల్లులకు లారీలు పంపేందుకు జియో ట్యాగింగ్ చేస్తున్నామని అన్నారు.అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, రమేశ్, జిల్లా రైస్ మిల్లుల సంఘం అధ్యక్షులు చంద్ర పాల్, జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్, డీఆర్డీవో శ్రీనివాస్, జిల్లా వ్యవసాయాధికారి ఆశాకుమారి, జిల్లా సహకార అధికారి కరుణ, తదితరులు పాల్గొన్నారు.