హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, ఇంధన ధరల పెరుగుదల వల్ల హజ్ యాత్ర ఖర్చులు భారీగా పెరిగాయి. దీంతో రాష్ట్రంలోని పేద ముస్లిం సోదరులపై ఈ అదనపు భారం పడకుండా చూస్తామని, ఆ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. ఈ నిర్ణయంతో దాదాపు 7 వేల మంది హజ్ యాత్రికులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుతుందని సోమవారం మంత్రివర్గ సమావేశంలో వెల్లడించారు. కాగా, కేంద్ర ప్రభుత్వం ఇంధన కొరతను సాకుగా చూపుతూ ఒక్కో యాత్రికుడు రూ.10 వేలు అదనంగా చెల్లించాలని ఇటీవల ఉత్తర్వులు జారీ చేయడంతో ‘హజ్ యాత్రికులపై ఇంధన భారం’ అనే శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ సోమవారం ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. పేద ముస్లింల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవాలని ఆ కథనంలో డిమాండ్ చేసింది. దీంతో తెలంగాణ నుంచి వెళ్తే హజ్ యాత్రికుల అదనపు ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. దీనిపై ముస్లిం సోదరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.