బంజారాహిల్స్, జూన్ 11: ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని దేవాదాయశాఖ కమిషనర్ ఎస్ వెంకట్రావు సూచించారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో బుధవారం శ్రీనగర్‌కాలనీలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో అర్చక అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ.. అర్చకుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇటీవల కొత్త పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. పెన్షన్, వైద్యం, ఇంటి నిర్మాణ రుణాలతోపాటు పలు పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు.
ఈ పథకాల అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేసేందుకు అన్ని జిల్లాల్లో అర్చక సదస్సులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ అదనపు కమిషనర్ శ్రీనివాస్‌రావు, అర్చక సంఘం నేతలు రవీంద్రాచార్యులు, చంద్రశేఖర శర్మ, సత్యనారాయణ శర్మ, కృష్ణమాచార్యులు, భద్రీనాథాచార్యులు, మురళీదర శర్మ, ఏడీసీలు, ఆర్జేసీలు, సహాయ కమిషనర్లు, ఈవోలు, పలు జిల్లాలకు చెందిన అర్చకులు పాల్గొన్నారు.