కవాడిగూడ, అక్టోబర్ 24: స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్యా-ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ల సాధనకు బీసీలు సమిష్టిపోరుకు సిద్ధంకావాలని శాసన మండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి పిలుపునిచ్చారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసేదాకా పోరాడాలని కోరారు. 42% రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చడమే అసలు పరిష్కారం అని చెప్పారు. ఆయా డిమాండ్ల మేరకు 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. మాజీ ఐఏఎస్ చిరంజీవులు అధ్యక్షతన జరిగిన ఈ మహాధర్నాలో మధుసూదనాచారి మాట్లాడారు. దేశంలో ఎవరు రాజ్యాధికారంలోకి రావాలన్నా మనమే కారణమని చెప్పారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటించేందుకు వారితో ఎస్సీ, ఎస్టీలు సంఘీభావంగా కలిసిరావాలని కోరారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తమిళనాడు వెళ్లి అధ్యయనం చేసి వచ్చామని, 9వ షెడ్యూల్లో చేర్చడమే పరిష్కారమని గుర్తించామని చెప్పారు.
42% రిజర్వేషన్ల అమలుకోసం ఎవరు పనిచేస్తున్నా వారితో ఏకీభవించి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వచ్చామని చెప్పారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించేంత వరకూ కలసికట్టుగా పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని తొలుత అసెంబ్లీలో తీర్మానం చేసిందే నాటి బీఆర్ఎస్ సర్కార్ అని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అనుకుంటే గంటలోపు 42% రిజర్వేషన్లు అమలులోకి వస్తాయని, కానీ, ఆ రెండు పార్టీలకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం జరిగే పోరాటాల్లో కలసి పనిచేస్తామని చెప్పారు.
బీసీలకు అడుగడుగునా కాంగ్రెస్ మోసం
బీసీ రిజర్వేషన్ల అంశంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను అడుగడుగునా మోసం చేస్తున్నదని జస్టిస్ ఈశ్వరయ్య ఆరోపించారు. బీసీలను వక్రమార్గంలో తీసుకెళ్తున్నదని, చిత్తశుద్ధితో పనిచేయడం లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలోని 2 కోట్ల బీసీల ఆకాంక్ష అయిన 42% బీసీ రిజర్వేషన్లను నెరవేర్చుకునేందుకు వ్యూహంతో కూడిన పోరాటాలను రాష్ట్రవ్యాప్తంగా సాగిస్తామని బీసీ ఎస్సీ ఎస్టీ చైర్మన్ విశారదన్ మహారాజ్ తెలిపారు. స్థానిక ఎన్నికల్లో, విద్యా ఉద్యోగా ల్లో 42% రిజర్వేషన్లను సాధించడమే లక్ష్యం గా ముందుకు సాగుతామని స్పష్టంచేశారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని బీపీ మండల్ మనుమడు సూరజ్‌మండల్ సూచించారు.
రాజ్యాంగంలో ఉన్న హక్కులు బీసీలకు దక్కడంలేదని, ఇందుకు అగ్రకుల పాలనే ముఖ్యకారణమని జాతీయ బీసీ నేత హరిశ్చంద్రమండల్ ఆందోళన వ్యక్తంచేశారు. బీసీ రిజర్వేషన్ల సాధనకు రాహుల్‌గాంధీ చొరవ తీసుకోవాలని మాజీ ఎంపీ వీ హనుమంతరావు కోరారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని మాజీ ఎంపీ బూరనర్సయ్యగౌడ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీసీలకు అసలు శత్రువులెవరో తెలుసుకొని వారిపైనే యుద్ధం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ చెప్పారు. మహాధర్నాలో ఎమ్మెల్సీలు నెల్లికంటి సత్యం, అద్దంకి దయాకర్, మధుయాష్కీగౌడ్, మాజీ ఐపీఎస్ పూర్ణచందర్రావు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ్‌గౌడ్, చెరుకు సుధాకర్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్ అయిలి వెంకన్నగౌడ్, ఏఐవోబీసీ స్టూడెంట్ అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్‌కుమార్, బీసీ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవరాజ్‌గౌడ్ పాల్గొన్నారు.