నారాయణపేట : వైద్య వృత్తి ఎంతో పవిత్ర మైనదని, వైద్య విద్యను అభ్యసించే అవకాశం రావడం గర్వకారణమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు( Chief Secretary Ramakrishna Rao) అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా గురువారం నారాయణపేట ( Narayanapeta )మండలం అప్పక్ పల్లి గ్రామ సమీపంలో గల ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించారు.
కళాశాల వద్ద జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ యోగేష్ గౌతమ్, స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గ్యాంగ్వర్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామ్ కిషన్, కడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసులు ఆయనకు గౌరవ వందనం చేశారు. అనంతరం మెడికల్ కళాశాలలో మెడికల్, నర్సింగ్, పారా మెడికల్ విద్యార్థులతో సీఎస్ ఇంట్రాక్ట్ అవుతూ కళాశాలలో చదువు కోవడం ఎలా అనిపిస్తుందని విద్యార్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ఉమ్మడి పాలమూరు జిల్లాతో తనకు అవినాభావ సంబంధం ఉందని, పాలమూరు జిల్లాలో 1996 లో పని చేశానని తెలిపారు. పాలమూరు జిల్లాలో వెనుక బడిన ప్రాంతమైన నారాయణపేట జిల్లా సమస్యలను అధిగమించి ముందుకు వెళ్లాలన్నారు. మెడికల్ కళాశాలలో అన్ని వసతి సౌకర్యాలు ఉన్నాయని, విద్యార్థులు చదువుకుని తల్లిదండ్రుల కలను నెరవేర్చాలని సూచించారు.
కళాశాల నుంచి సుశిక్తులైన వైద్యులుగా తయారై ప్రజలకు మెరుగైన వైద్య సేవలు( Better Medical Servics) అందించాలని తెలిపారు. మెరుగైన సేవలు అందించినప్పుడే వృత్తి కి న్యాయం చేసిన వాళ్లం అవుతాం అన్నారు. కళాశాల కాన్ఫరెన్స్ హాల్ లో కళాశాల ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో కళాశాల నిర్వహణ, ఇతర వసతి సౌకర్యాల గురించి చర్చించారు. ప్రభుత్వం హెల్త్ కేర్ పై ప్రత్యేక దృష్టి పెట్టిందని, నారాయణ పేట మెడికల్ కళాశాల రాష్ట్రంలోని మిగతా కళాశాలలకు ఒక మోడల్ గా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో రామచందర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జయ చంద్రమోహన్, టిజీ ఎం ఎస్ ఐ డి సి సీ. ఈ దేవేందర్, ఈ ఈ రవీందర్, డీ. ఈ. కృష్ణమూర్తి, వైద్య నిపుణులు పాల్గొన్నారు.
మెడికల్ కళాశాల సందర్శన అనంతరం సింగారం మలుపు దారి వద్ద జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ పంప్ ను పరిశీలించారు.