వెంగళరావునగర్( హైదరాబాద్ ) : జూబ్లీహిల్స్ ( Jubilee Hills ) నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఓటర్లతో ప్రత్యక్షంగా మమేకం కావాలని , బీఆర్ఎస్(BRS) ఇంటింటి ప్రచారాన్ని వేగవంతం చేయాలని మాజీ హోంమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమీక్షా సమావేశాన్ని సోమాజిగూడ క్లస్టర్ ఇన్‌చార్జ్‌లతో శ్రీనగర్‌కాలనీలోని నివాసంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బూత్ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీని పటిష్టంగా ఉంచాలని, కార్యకర్తలు కర్తవ్య నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటర్ల జాబితా పరిశీలనను ఈనెల 24వ తేదీకి ముందుగా పూర్తి చేసి తుది జాబితాను క్లస్టర్ ఇన్‌చార్జ్‌లకు సమర్పించాలని పేర్కొన్నారు.
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ( MLA Laxmareddy) మాట్లాడుతూ పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తలు ఓటర్లతో సత్సంబంధాలు పెట్టుకోవాలని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని కోరారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్దిని చెప్పి ఓటర్లను చైతన్యపర్చాలని కోరారు.
మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు వేసే దొంగ ఓట్లు పడకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు నిరాశ, నిస్పృహతో ఉన్నారని, రేవంత్‌రెడ్డి పాలనతో జనం విసిగిపోయారని పేర్కొన్నారు. పేదలు, రైతులు, విద్యార్థులు, మహిళలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు.
ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి బూత్ స్థాయిలో బృందాలు సమన్వయంతో పనిచేసి బీఆర్ఎస్ విజయానికి అకుంఠిత దీక్షతో కృషి చేయాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలని కోరారు.