గజ్వేల్, జనవరి 5: అక్రెడిటేషన్లు తగ్గిస్తే ఊరుకునేది లేదని మీడియా అకాడమీ మాజీ చైర్మన్, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్హాల్లో టీయూడబ్ల్యూజే (హెచ్-143) సభ్యత్వ నమోదు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉండాలని, జర్నలిస్టుల హక్కుల సాధనకు పోరాడుతామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జర్నలిస్టుల ఆరోగ్యం కోసం రూ.35 కోట్లు కేటాయించినట్టు తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో కోటి రూపాయలు ఉన్న బడ్జెట్ను స్వరాష్ట్రంలో రూ.100 కోట్లకు తీసుకెళ్లిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పదివేల మంది జర్నలిస్టులకు శిక్షణ శిబిరాల ద్వారా వృత్తి నైపుణ్యాలను పెంచినట్టు గుర్తుచేశారు. కరోనా కష్టకాలంలో 450 మంది జర్నలిస్టులకు రూ.20 వేల చొప్పున వైద్య ఖర్చుల నిమిత్తం ఇచ్చినట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 12 వేలు ఉన్న అక్రెడిటేషన్ కార్డులను 20 వేలకు పెంచినట్టు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా డెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులను ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని తెలిపారు. అనంతరం గజ్వేల్ డివిజన్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీసాగర్ తదితరులు పాల్గొన్నారు.