హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ ఆర్టీసీ నష్టాలు పూడ్చటంలో తొలి ఏడాదిలోనే సఫలీకృతమైనట్టు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. సంస్థ నష్టాల భర్తీకి ప్రజలపై డీజిల్ సెస్‌ల రూపంలో కొంత భారం మోపక తప్పలేదని చెప్పారు. ప్రజలతోపాటు ప్రతిపక్షాలు సైతం ఆర్టీసీ సెస్‌లపై వాస్తవ పరిస్థితి అర్థం చేసుకొన్నాయని పేర్కొన్నారు. ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా బాజిరెడ్డి బుధవారం బస్‌భవన్‌లో సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీని గట్టెక్కించడాన్ని చాలెంజ్‌గా తీసుకొన్నట్టు తెలిపారు.
సీఎం కేసీఆర్ అండతో సంస్థను కాపాడుతూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టు వరకు ఆర్టీసీ ఆదాయం రెట్టింపు అయ్యిందని పేర్కొన్నారు. కరోనాకు ముందు రోజుకు రూ.11 కోట్లు ఆర్టీసీ ఆదాయం ఉండేదని, కరోనా సమయం లో అది రోజుకు రూ.5 కోట్లకు పడిపోయిందని గుర్తుచేశారు. ప్రస్తుతం రోజుకు రూ.15 కోట్ల నుంచి రూ.16 కోట్లు వస్తున్నదని పేర్కొన్నారు. ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్) సైతం ప్రస్తుతం 62 శాతం నుంచి 70 శాతానికి చేరిందని.. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని తెలిపారు. 1200 మంది కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకోగా, తొలివిడతలో 168 మందిని చేర్చుకొంటున్నామని తెలిపారు. బుధవారం ఐదుగురికి కారుణ్య నియామక పత్రాలను ఎండీ సజ్జనార్‌తో కలిసి అందజేశారు. సమావేశంలో సీవోవో రవీందర్, ఈడీ మునిశేఖర్, యాదగిరి, వినోద్‌కుమార్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్‌గా ఏడాది పూర్తి చేసుకొన్న బాజిరెడ్డి గోవర్ధన్ బుధవారం రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారక రామారావును మర్యాదపూర్వకంగా కలిశారు. క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన బాజిరెడ్డిని కేటీఆర్ శాలువాతో ఘనంగా సత్కరించారు.