రాముడిపై భక్తిని చాటుకున్న అపర భక్తుడు లేడిబాబు
దశాబ్దం నుంచి రామకోటి..
కొత్తగూడెం ఎడ్యుకేషన్, అక్టోబర్ 26: రామదాసుకు శ్రీరాముడంటే ఎంత ఇష్టమో మనం విన్నాం. ఎన్నో కీర్తనలు విరచించి రామయ్యను కొలిచిన మహా భక్తుడాయన. అలాంటి భక్తులు నేటికీ ఉన్నారు. ఆయనలా కీర్తనలు రాయకపోయినా నిరంతరం రామజపం చేస్తున్నారు. కొత్తగూడెం పట్టణానికి చెందిన కడలి లేడిబాబు శ్రీరామకోటి రాసి భద్రాద్రి రామయ్య పాదాల చెంతకు చేర్చారు. రాముడంటే లేడిబాబుకు ఎనలేని భక్తి. ఏడు పదుల వయస్సులోనూ ఆయన నామస్మరణ చేయని క్షణం ఉండదు. ప్రతిరోజూ తెల్లవారుజామున రాముడికి పూజ లు చేస్తారు.
పదేండ్ల వయసు నుంచి లేడిబాబు రామకోటి రాస్తున్నారు. శ్రీరామ నామాన్ని 120 పుస్తకాల్లో 1.20 కోట్ల సార్లు రాసి రామయ్యపై తన భక్తిని చాటుకున్నారు. కొత్తగూడెంలోని సింగరేణి మెయిన్ దవాఖాన ఎదురుగా ఆయన చిన్న హోటల్ నడుపుతున్నారు. ఈ నెల 21న తాను పూర్తి చేసిన శ్రీరామకోటి పుస్తకాలను భద్రాచలం రామాలయ అధికారులకు అందించారు. శ్రీరామకోటి పూర్తి చేసినందుకు పట్టణానికి చెందిన భక్తులు, పెద్దలు లేడిబాబును సన్మానించారు. మరోసారి శ్రీరామకోటి పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నానని లేడిబాబు ‘నమస్తే తెలంగాణ’తో అన్నారు.