కరీంనగర్ కమాన్‌చౌరస్తా, అక్టోబర్ 15: బీఆర్ఎస్ తొమ్మిదేండ్ల పాలనలో 1.3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. మరో 85 వేల పైచిలుకు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని చెప్పారు. స్వరాష్ట్రంలో ఇక్కడి యువత కల సాకారమవుతుందని అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కృషి భవన్లో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2018 నుంచి నిర్వహిస్తున్న వారధి స్టడీ సెంటర్లో కోచింగ్ తీసుకొని ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల సత్కార సభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పనకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నదని చెప్పారు.
ఇటీవలే పెద్దమొత్తంలో పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ, టీఆర్టీ ద్వారా నోటిఫికేషన్లు జారీ చేసిందని పేర్కొన్నారు. నిరుపేద నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చేందుకు ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్వంలో వారధి స్టడీ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఇక్కడ శిక్షణ తీసుకున్నవారిలో 287 మంది ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో మేయర్ వై సునీల్ రావు, ప్రతిమ ఫౌండేషన్ చైర్పర్సన్ డాక్టర్ హరిణి, డైరెక్టర్ డాక్టర్ ప్రతీక్, గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు పొన్నం అనిల్ గౌడ్, ఎస్సీ స్టడీ సరిల్ ఇన్చార్జి శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు జకుల నాగరాజు పాల్గొన్నారు.