రవీంద్రభారతి, జూలై 8: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ సంస్థ ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రకటించారు. బషీర్‌బాగ్ దేశోద్ధ్దారక భవన్లో ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన డ్రైవర్ కోళ్ల శంకర్‌గౌడ్ సంస్మరణ సభలో తలసాని పాల్గొన్నారు. శంకర్‌గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు రూ. లక్ష చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. శంకర్‌గౌడ్ చేసిన ప్రాణత్యాగం ఆర్టీసీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అపాయింటెడ్ డే ప్రకటించడమే మిగిలిందని అన్నారు. ప్రభుత్వంలో విలీనం చేయాలనేది శంకర్‌గౌడ్ చివరి కోరిక అని , అది నెరవేరేవరకు ఉద్యమ స్ఫూర్తితో ఉద్యోగులు పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, హైదరాబాద్ రీజియన్ బీసీ ఆర్టీసీ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు గుర్రం పవన్‌కుమార్‌గౌడ్ పాల్గొన్నారు.