హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): మావోయిస్టు పార్టీ నాయకుడు చందన్ మిశ్రాతోపాటు ఆయన భార్య రేపాక స్వాతిని జగద్గిరిగుట్ట పోలీసులు అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్నారని, వారిని కోర్టులో హాజరుపర్చేలా పోలీసులకు ఉత్తర్వులు ఇవ్వాలని రాష్ట్ర పౌరహకుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై సోమవారం హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. దీంతో మిశ్రాను అరెస్టు చేసింది ఏపీ పోలీసులని, తెలంగాణ పోలీసులు కాదని రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. శ్రీకాకుళం జిల్లా రంపచోడవరం పరిధిలోని చింటూరు పోలీసులు ఓ కేసులో మిశ్రాను అరెస్టు చేశారని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది తెలిపారు.
స్వాతిని పోలీసులు అదుపులోకి తీసుకోలేదని, ఆమె తన ఇంట్లోనే సురక్షితంగా ఉన్నారని వివరించారు. లెనిన్‌నగర్‌లో ఉంటున్న స్వాతిని కోర్టు ఆదేశాల మేరకు కూకట్పల్లి మేజిస్ట్రేట్ కోర్టులో హాజర్చామని, ఆ సమయంలో స్వాతి వెంట ఆమె సోదరుడు క్రాంతి కూడా ఉన్నారని చెప్పారు.
ఈ వాదనపై జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ బీఆర్ మదుసూదన్‌రావు ధర్మాసనం స్పందిస్తూ.. మిశ్రాను ఏపీ పోలీసులు అరెస్టు చేస్తే అకడి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చాక పీటీ వారెంట్ ఎందుకు పొందలేదని ప్రశ్నించింది. ఆయనను తీసుకెళ్లిన వాహనం నంబర్, ఇతర వివరాలు అందజేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.