KTR | చిన్న చిన్న తప్పిదాలతోనే వికారాబాద్‌లో బీఆర్ఎస్ గెలువలేకపోయిందని.. మెతుకు ఆనంద్ నిజాయితీ గల వ్యక్తి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. మెతుకు ఆనంద్ లౌక్యం నేర్చుకోవాలని.. రెండుసార్లు గెలిపించిన వికారాబాద్ ప్రజల రుణం తీర్చుకునే ప్రయత్నం బీఆర్ఎస్ చేసిందని.. అందులో భాగంగానే వికారాబాద్ జిల్లా కావాలన్న ఐదు దశాబ్దాల కలను నెరవేర్చామన్నారు. తెలంగాణ భవన్లో వికారాబాద్ కార్యకర్తల, నేతల సమావేశం జరిగింది. సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. వికారాబాద్‌ని జిల్లా చేసిన నాయకుడు కేసీఆర్ అని.. వికారాబాద్‌కు ఓ మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజ్ ఇచ్చింది కేసీఆర్ అన్నారు.
అధికారంలోకి వచ్చినాక అనంతగిరిని అద్భుతంగా అభివృద్ధి చేసుకుందామన్నారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిద్దామన్నారు. బీఆర్ఎస్ హయాంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 90శాతం పూర్తయ్యిందని.. కాంగ్రెస్ నాయకుల కేసులతోనే కొంత పనులు మిగిలిపోయాయన్నారు. నార్లాపూర్ దగ్గర ఒక పంపును కేసీఆర్ కూడా ప్రారంభించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వికారాబాద్ గ్రామాలకు సాగునీరు అందుతుందన్నారు. కాంగ్రెస్ నాయకులతో అది సాధ్యం కాదని.. వాళ్లు కమిషన్ వచ్చే పనులు మాత్రమే చేస్తారన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోని మంత్రులు అందిన కాడికి దోచుకుంటూనే ఉన్నారని.. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ని సమూలంగా నాశనం చేశారన్నారు. రియల్ ఎస్టేట్‌తో పెద్ద ఆసాములే కాదని.. సామాన్య జనం కూడా లాభపడుతారన్నారు. ఆరు గ్యారంటీలని అడ్డమైన హామీలు ఇచ్చి రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని.. రేవంత్ రెడ్డి పుణ్యాన మరో 15 ఏళ్ల వరకు తెలంగాణలో ఓట్లు అడిగే పరిస్థితిలో కాంగ్రెస్ ఉండదన్నారు.