హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): అదనపు వరిధాన్యం సేకరణ వల్ల పడే ఆర్థిక భారాన్ని రాష్ట్రం భరించలేదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తేల్చిచెప్పారు. పెరుగుతున్న వరి ఉత్పత్తి నేపథ్యంలో సేకరణ లక్ష్యాన్ని కూడా పెంచాలని, సీఎమ్మార్ గడువును పొడిగించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర ఆహారశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీకి గురువారం లేఖ రాశారు. కేంద్రం ముందు పలు డిమాండ్లు పెట్టారు. కస్టమ్ మిల్డ్ రైస్ (సీఎంఆర్), బాయిల్డ్ బియ్యం లక్ష్యాలను తగ్గించాలన్న కేంద్రం విధానం వల్ల, తెలంగాణ అదనపు నిల్వలు, నిల్వ ఖర్చులు, మిల్లింగ్ ఖర్చులు, వడ్డీ బాధ్యతలతో ఆర్థికంగా ఇబ్బందులనెదుర్కొంటున్నదని తెలిపారు. నిరంతరం సేకరణ ప్రయత్నాలు చేస్తున్నా ఎఫ్‌సీఐకి సరఫరా చేసిన బాయిల్డ్ రైస్ 2024-25 నాటికి 66.78 శాతానికి పడిపోయిందని పేర్కొన్నారు.
తెలంగాణలో భారీగా వరిధాన్యం ఉత్పత్తి పెరుగుతున్నదని, కేంద్రం కేటాయిస్తున్న సేకరణకు మధ్య ఎంతో వ్యత్యాసముందని వివరించారు. ఎఫ్‌సీఐ ముడి బియ్యం సేకరణ లక్ష్యాన్ని తగ్గించి, రబీకి గాను 5 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) బాయిల్డ్ రైస్ సేకరించేలా లక్ష్యాన్ని పునఃకేటాయించాలని కోరారు. 2024-25 రబీకి సంబంధించి ప్రస్తుతం 8.45 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా కావాల్సి ఉందని, ధాన్యం నిల్వల భౌతిక ధ్రువీకరణ పెండింగ్‌లో ఉండడంతోపాటు, అదనపు ప్రాసెసింగ్‌కు అవసరమైన నేపథ్యమే కారణమని వివరించారు. అందుకు సంబంధించిన సరఫరా గడువును మరి కొన్ని నెలలు పొడిగించాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తిచేశారు.
తెలంగాణ వరి ధాన్యాన్ని పారాబాయిల్డ్ బియ్యంగా మార్చేందుకు అనుకూలంగా ఉంటాయని పేరొన్నారు. రైస్ మిల్లర్లు కేవలం 5శాతం నూకలను మాత్రమే సరఫరా చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించారని తెలిపారు. రాష్ట్రంలో పెరుగుతున్న వరిధాన్యం ఉత్పత్తి సామర్థ్యానికి అనుగుణంగా, పారాబాయిల్డ్ బియ్యం లక్ష్యాన్ని 20 లక్షల మెట్రిక్ టన్నుల మేరకు పెంచాలని కోరారు. లక్షలాది మంది రైతులను కాపాడటానికి ధాన్యం సేకరణ కొనసాగింపు అత్యవసరమని తెలిపారు. ఉడకబెట్టిన బియ్యం కేటాయింపులు, సకాలంలో సీఎమ్మార్ పొడిగింపుల రూపంలో కేంద్ర మద్దతు లేకుండా అదనపు వరిధాన్యం ఉత్పత్తి వల్ల కలిగే ఆర్థిక భారాన్ని రాష్ట్రం భరించలేదని మంత్రి ఉత్తమ్‌కుమార్ నొక్కిచెప్పారు. సత్వరం సమస్యలను సానుకూలంగా పరిశీలించాలని కోరారు.
తొలుత సివిల్ సప్లయ్‌శాఖ ఉన్నతాధికారులు, మిల్లర్లతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రత్యేకంగా సమీక్షించారు. యాసంగికి సంబంధించి ధాన్యం కొనుగోలుపై చర్చించారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై ఆరా తీశారు. అధికారులు పలు సూచనలు చేశారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు.