హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో రైల్వే నెట్వర్క్ అభివృద్ధిపై కేంద్రం అంకితభావంతో పనిచేస్తున్నదని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. గురువారం న్యూఢిల్లీలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టుల పురోగతి, కొత్తగా చేపట్టాల్సిన ప్రాజెక్టులు, రైల్వే లైన్ల విద్యుదీకరణ అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనతోపాటు 42 ప్రధాన రైల్వే అభివృద్ధి పనుల ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొత్త రైల్వేలైన్లు, హైస్పీడ్ రైల్ కారిడార్ పనుల పురోగతి, ఎంఎంటీఎస్ రైలు సర్వీసుల విస్తరణ, వాటి పురోగతిపై ఇరువురు నేతలు డిస్కస్ చేశారు. హైదరాబాద్ ప్రయాణికులకు ఎంతో కీలకమైన ఎంఎంటీసీ సేవలను మరింత మెరుగుపరిచేందుకు త్వరలో ఉన్నతాధికారులతో భేటీ నిర్వహించి చర్యలు తీసుకుంటామని అశ్వినీవైష్ణవ్ కిషన్‌రెడ్డికి హామీ ఇచ్చారు.