
జమ్మికుంట/ ఇల్లందకుంట/ హుజూరా బాద్, ఆగస్టు 9 : హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు సబ్బండవర్ణాలు మద్దతు తెలుపుతున్నాయి. వినూత్న పథకాలతో తెలంగాణను దేశంలోనే నంబర్ వన్‌గా నిలిపిన సీఎం కేసీఆర్‌కు బాసటగా నిలుస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి పల్లెల్లోని కుల సం ఘాలు, యూనియన్లు జైకొడుతున్నాయి. గులాబీ పార్టీకి తమ మద్దతునిస్తూ ఏకగ్రీవం గా తీర్మానిస్తున్నాయి. సోమవారం హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇల్లందకుంట మండలం పాతర్లపల్లి, లక్ష్మాజీపల్లి గొల్లకురుమలు, హుజూరాబాద్ రెడ్డి ఐక్యవేదిక నాయకులు మద్దతు పలుకగా, జమ్మికుంటలో ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీ నిర్వహించారు.
గొల్ల, కురుమల తీర్మానం
ఇల్లందకుంట మండలం పాతర్లపల్లి, లక్ష్మాజీపల్లి గొల్లకురుమలు టీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు తెలికారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, గొల్లకుర్మ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గోసుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో కులస్థు లంతా సమావేశమై, ఏకగ్రీవంగా తీర్మానించారు. తీర్మాన ప్రతులను శ్రీనివాస్‌కు అందజేశారు. కార్యక్రమంలో ఇల్లందకుంట మం డల ఇంచార్జి కడారి భిక్షపతి, యాదవ సం ఘం మండలాధ్యక్షుడు మహిపాల్‌యాదవ్, యాదవ సొసైటీ అధ్యక్షుడు గడ్డి రాములు, జిల్లా యాదవ సంఘం నాయకులు రవి కుమార్ యాదవ్, పాతర్లపల్లిలో ఉప సర్పంచ్ గణేశ్‌యాదవ్, అన్నం కొమురయ్య యాదవ్, కుడారి కొమురయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్కు రెడ్డి ఐక్యవేదిక మద్దతు
హుజూరాబాద్ రెడ్డి ఐక్యవేదిక నాయకులు టీఆర్ఎస్కు జైకొట్టారు. రెడ్డి కులస్థుల ను అన్ని రకాలుగా ఆదుకుంటున్న టీఆర్ఎస్కే మద్దతు ఇస్తున్నట్టు ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంది తిరుపతిరెడ్డి ప్రకటించారు. సోమవారం హుజూరాబాద్ పట్టణం లో మీడియాతో మాట్లాడుతూ.. విద్య, ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అభినందనీయమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాతీయ హోదా ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. సమావేశంలో సంఘం నాయకులు భూంపెల్లి రాఘవరెడ్డి, పీ రాంరెడ్డి పాల్గొన్నారు.
జమ్మికుంటలో ఆటో డ్రైవర్ల భారీర్యాలీ
టీఆర్ఎస్కు మద్దతుగా ఉంటామని జమ్మికుంట పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్లు ప్రకటించారు. సోమవారం పట్టణంలో ఆటోలతో భారీ ర్యాలీ తీయగా ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జెండా ఊపి ప్రారంభించారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ స్వయంగా ఆటో నడుపగా మంత్రి కొప్పుల, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పార్టీ జెండాలతో ఆటోకు ఇరువైపులా నిల్చొని డ్రైవర్లలో ఉత్సాహం నింపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తకళ్లపల్లి రాజేశ్వర్‌రావు, ఆటోయూనియన్ అధ్యక్షుడు పురం రమేశ్ తదితరులు పాల్గొన్నారు.