Dharani Portal | హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ‘గతంలో వందల కోట్లు ఖర్చుచేసి తెచ్చిన ధరణి పోర్టల్‌నే వినియోగిస్తున్నం.. మేం కొత్త పోర్టల్ తీసుకొనిరాలేదు..’ అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు భూభారతి టీఎం మాడ్యుల్లో రైతుల దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం ఏదైనా గడువు విధించిందా? అని ప్రశ్నించారు. ఇందుకు మంత్రి పొంగులేటి సమాధానం ఇచ్చారు.
‘మేం కొత్త పోర్టల్‌ను తీసుకొచ్చామని చెప్పడంలేదు. టైలర్ సంచి కుడితే ఆ కుట్టిన దానికి మేం అక్కడక్కడ ప్యాచ్ చేసి, మిగతాదాన్ని సవరించినట్టు ధరణిని స్ట్రీమ్‌లైన్ చేశాం..’ అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. మంత్రి మాటల తో మండలి సభ్యులు నోరెళ్లబెట్టారు. గత అసెంబ్లీ సమావేశాల్లో ధరణిని బంగాళాఖాతంలో వేశామని, మెరుగైన మాడ్యుల్స్‌తో భూభారతి పోర్టల్ తెచ్చామని అసెంబ్లీ సాక్షిగా మంత్రి చెప్పిన మాటలు ఉత్తవేనని తాజా వ్యాఖ్యలతో తేటతెల్లమైంది. కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన భూభారతి.. ధరణికి నకలేననే విషయం చట్టసభల సాక్షిగా రూఢీ అయింది. కాగా, మంత్రి వ్యాఖ్యలపై సోషల్‌మీడియాలో నెటిజన్లు సైటైర్లతో విరుచుకుపడ్డారు. యాదాద్రి భువనగరి లాంటి నాలుగైదు జిల్లాల్లో అక్రమాలు జరిగాయని, ఎంతపెద్ద అధికారులైనా వదిలిపెట్టబోమని పేర్కొన్నారు.