హైదరాబాద్, మార్చి 11(నమస్తే తెలంగాణ) : ‘విజయ’ డెయిరీ విషయం లో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల మధ్య నెలకొన్న వివాదంపై ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. తెలంగాణ విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి చేసిన అభ్యంతరాలపై తాము సమీక్షిస్తున్నట్టు ఏపీ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. విజయ డెయిరీ పాల శాంపిళ్లు తీసుకొని ఏపీడీడీసీఎఫ్ నాణ్యత పరీక్షలు నిర్వహిస్తుందని తెలిపారు.
సీఏఎల్ఎఫ్-ఎన్డీడీబీ పరీక్ష నివేదికలను పరిశీలిస్తామని, ప్రస్తుతం మారెట్లో ర్యాండమ్‌గా శాంపిళ్లు సేకరిస్తున్నారని చెప్పారు. ‘వన్ నేషన్, వన్ మారెట్’ అనేది ప్రధాని మోదీ నినాదమని, పాడి ఉత్పత్తులను ఇతర రాష్ట్రాల్లోనూ విక్రయించవచ్చని పేర్కొన్నారు. విజయ డెయిరీ పేరుతో ఏపీకి చెందిన మేఘన అనే సంస్థ కల్తీ పాలు అమ్ముతుందని గుత్తా అమిత్‌రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే.