హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ ) : అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు నానాపాట్లు పడుతున్నారు. మొత్తం పది మందిలో ఇద్దరు తాము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని పేర్కొంటూ స్పీకర్ కార్యాలయానికి లేఖలు ఇచ్చినట్టు తెలిసింది. ఆ ఇద్దరు గత కొన్ని రోజుల నుంచి మీడియాలో మాట్లాడుతూ తాము బీఆర్ఎస్ సభ్యులమేనని చెప్పిన విషయం తెల్సిందే. వీరిలో ఒకరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని కేసు కూడా పెట్టారు. ఇప్పుడు మీడియాతో మాట్లాడిన క్లిప్పింగ్‌లు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు కాపీని కూడా స్పీకర్ కార్యాలయంలో ఇచ్చినట్టు సమాచారం. మరో ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలు మాత్రం మరో వారంపాటు తమకు గడువు కావాలని కోరినట్టు తెలిసింది. వారు కోరిన విధంగా స్పీకర్ కార్యాలయం గడువు ఇచ్చినట్టు సమాచారం. వీరు న్యాయనిపుణులతో చర్చించి నిర్ణయం చెప్తామన్నట్టు తెల్సింది. మరో ఇద్దరికి ఇచ్చిన గడువు ఇంకా పూర్తికాలేదు. రేపోమాపో వాళ్లు తమ వివరణను స్పీకర్‌కు ఇవ్వనున్నారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేల జాబితాలో ఉన్న మరో కీలక సభ్యుడు.. తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తానని అన్నట్టు తెలిసింది. రాజీనామా చేసిన తర్వాత కూడా తనకే ఆ సీటు ఇవ్వాలని, ఈ లోపు తన నియోజకవర్గానికి సంబంధించిన పెండింగ్ పనులకు నిధులు ఇవ్వాలని సీఎంను కోరినట్టు సమాచారం. దీంతో ఆ నియోజకవర్గానికి నిధుల వరద మొదలయ్యింది. ఇటీవల సీఎం వద్ద జరిగిన ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీకి ఆయన గైర్హాజరైనట్టు తెలిసింది. తన ప్రాధాన్యతలు తనకు ఉన్నాయని, ఫిరాయింపుల అంశాన్ని ఇంకా ఎక్కువ కాలం సాగదీసే అవకాశం కనిపించడంలేదని ఆయన సన్నిహితుల వద్ద అన్నట్టు చెప్తున్నారు. స్పీకర్ సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చి, సుప్రీంకోర్టు విచారణ చేపట్టేనాటికి తన పదవికి రాజీనామా చేయాలన్న ఆలోచనతో సదరు ఎమ్మెల్యే ఉన్నట్టు సమాచారం. ఇవే చివరి ఎన్నికలని ప్రచారానికి సిద్ధమవుతున్నట్టు తెలిసింది.
ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టు విచారణలో ఉండటం, రాజకీయంగా ఒత్తిడి పెరగడంతో న్యాయ సలహా అందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి వారికి భరోసా ఇచ్చినట్టు తెలిసింది. న్యాయ సహాయానికి అవసరమైన మొత్తం ఖర్చును కాంగ్రెస్ పార్టీ భరిస్తుందని, ప్రభుత్వపరంగా కూడా సహాయం అందిస్తామని చెప్పినట్టు సమాచారం. ఒకవేళ సుప్రీంకోర్టు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేసినా వాళ్లకే టికెట్లు ఇచ్చి గెలిపించుకునేందుకు అవసరమైన నిధులు కూడా సమకూరుస్తామని చెప్పినట్టు తెలిసింది.