హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలతోపాటు చెప్పని పథకాలను కూడా అమలు చేస్తున్నదని, సన్న బియ్యం ఇస్తామని మ్యానిఫెస్టోలో చెప్పకపోయినా ఇస్తున్నామని పర్యాటక, ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఒకేదఫా రూ.20,616.18 కోట్ల రైతు రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డిదని తెలిపారు. తమ ప్రభుత్వం ఎకరానికి రూ.6వేల రైతు భరోసా ఇచ్చిందని, సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తున్నామన్నారు. ప్రతిపక్షాలు చేసే ఆరోపణలను ప్రజలు నమ్మరని వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడుతుందని జోస్యం చెప్పారు.
మేయర్లు దార్శనికతతో పనిచేయాలి ; అవగాహన సదస్సుల్లో ఎంఏయూడీ కమిషనర్ శ్రీదేవి
హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): నగరాలు, పట్టణాల అభివృద్ధికి మేయర్లు, చైర్పర్సన్లు దార్శనికతతో పనిచేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి టీకే శ్రీదేవి సూచించారు. హైదరాబాద్‌లోని మెరిక్యూర్ హోటల్లో వరంగల్, హైదరాబాద్ రీజియన్ల పరిధిలోని మేయర్లు, చైర్పర్సన్లతో నిర్వహించిన ఒక్కరోజు అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. విధివిధానాల అమలు, ప్రజలతో నిరంతర అనుసంధానం, దీర్ఘకాలిక ఆలోచనలతో ముందుకు సాగాలని సూచించారు. పనులను ప్రాధాన్య క్రమంలో ఎంచుకోవాలని, అందులో మానవీయ కోణం ఉండాలని చెప్పారు. ప్రజలకు మంచి చేయాలనే సంకల్పం ఉంటే, చట్టమే దారి చూపిస్తుందని తెలిపారు.