Harish Rao | సిద్దిపేట, ఆగస్టు 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఓవైపు వర్షాభావ పరిస్థితులు, మరోవైపు అడుగంటిన జలాశయాలు ఫలితంగా వానకాలం సాగుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు ఎత్తిపోసి రైతులకు సాగునీరిచ్చే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తాత్సారం చేస్తున్నది. ఈ క్రమంలో రైతుల ఇబ్బందులను మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
సిద్దిపేట జిల్లాలోని అన్నపూర్ణ, రంగనాయక, మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లను నింపి రైతులకు సాగునీరివ్వాలని ఆయన శనివారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆదివారం సాగునీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా స్పందించారు. ‘మీరు రాసిన లేఖ అందింది.. సోమవారం నుంచి మిడ్‌మానేరు ద్వా రా సిద్దిపేట జిల్లాలోని రిజర్వాయర్లకు నీటిని ఎత్తిపోస్తాం’ అని హరీశ్‌రావుకు బదులిచ్చారు. దీంతో హరీశ్‌రావుకు రైతులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.