హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): వర్షాలు,వరదలతో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. 9 నెలలుగా మరమ్మతుకు నోచుకోని రోడ్లు వర్షాలతో 150ప్రాంతాల్లో కొట్టుకుపోయినట్టు, 500 రోడ్లు భారీగా దెబ్బతిన్నట్లు ఆర్అండ్బీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వీటి మరమ్మతులకు సుమారు రూ. 600 కోట్ల వరకు అవసరమవుతాయని అధికారులు తెలిపారు. 117 గ్రామాల్లో పంచాయతీరాజ్ రోడ్లు దెబ్బతినడం వల్ల 80 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో 600 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని, వీటి మరమ్మతుకు రూ.421 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు.
బకాయిలు పెండింగ్
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి రోడ్ల పునరుద్ధరణ పనులు జరగలేదు. తాత్కాలిక మరమ్మతు పనులు సైతం నిధుల కొరత పేరుతో అరకొరగా పూర్తిచేశారు. బకాయిలు చెల్లించకపోవడంతో పునరుద్ధరణ పనులకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు. సుమారు రూ. 800 కోట్ల వరకు కాంట్రాక్టర్ల బకాయిలు పెండింగులో ఉన్నట్టు సమాచారం.
నిలిచిన నీటి సరఫరా
భారీ వర్షాలు, వరదల వల్ల 5,700 గ్రామాల్లో తాగునీటి సరఫరా నిలిచిపోయింది. మిషన్ భగీరథ సబ్‌స్టేషన్లలోకి నీరు చేరడంతో విద్యుత్తు నిలిపివేసిన కారణంగా పలు గ్రామాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నీటి పంపింగ్‌కి అవసరమైన విద్యుత్తు లేక 5700 ఆవాస గ్రామాలకు, వరదల వల్ల 1400 చోట్ల మిషన్ భగీరథ పైపులు దెబ్బతిన్నాయి. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో తాగు నీటిని సరఫరా చేసిందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రెండు వేల ఆవాసాల్లో మిషన్ భగీరథ సబ్ స్టేషన్లను పునరుద్ధరించి నీటి సరఫరా చేశారు.