భద్రాచలం/ దుమ్ముగూడెం/ పర్ణశాల, సెప్టెంబర్ 26: భద్రాచలం వద్ద గోదావరి వరద నీటిమట్టం క్రమేపి పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో శ్రీరామ్సాగర్తోపాటు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి అధికంగా వరద వచ్చి గోదావరిలో చేరుతోంది. భద్రాచలం వద్ద ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 45 అడుగుల వరకు ఉండగా మరో మూడు అడుగులు పెరిగి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని నీటిపారుదలశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గురువారం అర్ధరాత్రి 12గంటలకు 35.90 అడుగులున్న నీటిమట్టం శుక్రవారం ఉదయం 6గంటలకు 40.80 అడుగులకు చేరుకుంది. మధ్యాహ్నం 12గంటలకు మొదటి ప్రమాద హెచ్చరిక అయిన 43 అడుగులకు చేరుకుంది.
దీంతో సబ్ కలెక్టర్ మృణాల్శ్రేష్ట భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారికంగా జారీ చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు 43.30, మూడు గంటలకు 43.90, రాత్రి 10 గంటలకు 45.50 అడుగులకు చేరుకుంది. ఇదిలా ఉండగా దుమ్ముగూడెం మండలంలోని తూరుబాక డైవర్షన్ రోడ్డుపైకి వరద నీరు చేరింది. దీంతో భద్రాచలం- చర్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు రామచంద్రాపురం మీదుగా వెళ్తున్నారు. ఏపీలోని కూనవరం, నెల్లిపాక గ్రామాల వద్ద సైతం వరద రోడ్డుపైకి చేరింది. దీంతో ఆర్టీసీ అధికారులు చర్ల, వెంకటాపురం, కూనవరం వెళ్లే బస్సులను నిలిపివేశారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ జితేశ్ వి పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతున్నందున నది పరీవాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.నీటిమట్టం 43 అడుగులకు చేరుకున్నందున మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశామని శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. వరద పరిస్థితిని జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తున్నదని, అత్యవసర పరిస్థితులు తలెత్తితే వెంటనే అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాలిపేరు నీటి విడుదల
చర్ల, సెప్టెంబర్ 26: మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు నుంచి శుక్రవారం 15 గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి 20,753 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. గత రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతం ఛత్తీస్గఢ్ అడవుల నుంచి వరద భారీగా వస్తున్నందున సిబ్బందిని అప్రమత్తం చేశామని డీఈ తిరుపతి, ఏఈలు ఉపేందర్, సంపత్ తెలిపారు.