హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ)/ఖమ్మం/వరంగల్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం దాల్చింది. శుక్రవారం సాయంత్రం నీటి ప్రవాహం 71 అడుగులకు చేరుకొన్నది. దీంతో 22 ఏండ్ల క్రితం 1990లో వచ్చిన 70.8 అడుగుల వరద రికార్డును బద్దలుకొట్టింది. శుక్రవారం అర్ధరాత్రికి 1986లో నమోదైన 75.63 అడుగుల అత్యధిక ప్రవాహ మట్టాన్ని సైతం అధిగమిస్తుందనే అంచనాలున్నాయి. ఎగువన ఉన్న పరిస్థితులను చూస్తుంటే 77 అడుగులు దాటి, కొత్త రికార్డులను నెలకొల్పే అవకాశం లేకపోలేదని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఎగువ నుంచి భారీగా ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువన లక్ష్మీ బరాజ్ నుంచి 22.82 లక్షల క్యూసెక్కులు, సమ్మక్క బరాజ్ నుంచి 23.80 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. ఎస్సారెస్పీలోకి వరద తగ్గినప్పటికీ, ప్రాణహిత నుంచి వరద ఉధృతి కొనసాగుతూనే ఉన్నది.
మేడిగడ్డ వద్ద 23 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా ఆ మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన వర్షాలు కురుస్తుండటం, ఉపనదులు జోరుగా ప్రవహిస్తుండటంతో గోదావరి నది ఎప్పుడు, ఎక్కడ, ఏ స్థాయిలో పోటెత్తుతుందో అంచనా వేయలేని పరిస్థితి నెలకొన్నది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్న కలెక్టర్ అనుదీప్ ముంపు ప్రాంతాల్లో హైఅలెర్ట్ ప్రకటించారు. భద్రాచలం బ్రిడ్జిపై శుక్రవారం కూడా రాకపోకల నిషేధం కొనసాగింది. దీంతో ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మధ్య తిరిగే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. శనివారం సాయంత్రం వరకు రాకపోకల నిషేదం అమలులో ఉంటుంది. వరద తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ బృందం, సింగరేణి బృందం, 68 మంది సైనికదళం, 10 మంది వైద్యులు, 23 మంది ఇంజినీరింగ్ అధికారులు, 210 మంది గజఈత గాళ్లను అందుబాటులో ఉంచింది.
జలదిగ్బంధంలోనే ఏజెన్సీ
వర్షం తగ్గినా ఎగువ నుంచి వస్తున్న గోదావరి వరద ఉధృతికి ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ఏటూరునాగారం, మంగపేట, వాజేడు, వెంకటాపురం (నూగూరు) మండలాల్లోని రోడ్లు, ఎక్కువ ఇండ్లు జలవలయంలోనే ఉన్నాయి. రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద మూడవ ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తున్నది.
ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక
ఏపీలోని ధవళేశ్వరం బరాజ్ వద్ద వరద ఉధృతి కొనసాగుతున్నది. 19 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. వరద నేపథ్యంలో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీచేశారు.
బూర్గంపహాడ్‌లో నాటు పడవ బోల్తా
బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలో శుక్రవారం ఒక నాటు పడవ నీట మునిగింది. ఎటువంటి అనుమతులు లేని ఈ పడవ మండలంలోని మిల్సెంటర్ నుంచి సంజీవరెడ్డిపాలెంలోని పునరావాస కేంద్రానికి వెళ్తుండగా విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టడంతో బోల్తా పడింది. ఆ సమయంలో నాటు పడవలో 12 మంది ప్రయాణిస్తున్నారు. వీరంతా హాహాకారాలు చేస్తుండటంతో గమనించినవారు తాసిల్దార్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 11 మందిని ఒడ్డుకు చేర్చాయి. వెంకటనర్సు (40) అనే వ్యక్తి గల్లంతయినట్టు గుర్తించారు. నీటిలో మునిగిన వారిలో రమేశ్‌కు ఈత రావడంతో నలుగురుని కాపాడాడు. వారిలో ఆరేండ్ల బాబు కూడా ఉన్నాడు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి స్థానిక టీఆర్ఎస్ నాయకుడు గోనెల నాని మిత్ర బృందం సహకారం అందించారు.
భద్రాచలం, మణుగూరుకు ప్రత్యేక అధికారులు
గోదావరి నదికి భారీగా వరదలు పోటెత్తిన నేపథ్యంలో భద్రాచలం, మణుగూరు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను సమర్ధవంతంగా చేపట్టేందుకు మున్సిపల్‌శాఖ ప్రత్యేక అధికారులను నియమించింది. భద్రాచలానికి గ్రేటర్ వరంగల్ నగర డిప్యూటీ కమిషనర్ ఈ జొనాహ్ను, మణుగూరుకు ఖమ్మం నగర పాలక సంస్థ ఈఈ కృష్ణాలాల్ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ అధికారులు తమతో పాటు మొత్తం 50 మంది పారిశుద్ధ్య కార్మికులను కూడా తీసుకెళ్లనున్నారు. వీరంతా శనివారం జిల్లా కలెక్టర్‌కు రిపోర్ట్ చేయనున్నారు.
సహాయక చర్యల్లో టీఆర్ఎస్ శ్రేణులు:అభినందించిన కేటీఆర్
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అండగా నిలుస్తున్న మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు పార్టీ వరింగ్ ప్రెసిడెంట్, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు ధన్యవాదాలు తెలిపారు. చరిత్రలో ఎన్నడూలేనంతగా జూలై నెలలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం పార్టీ శ్రేణులు ప్రజలకు అండగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. కష్ట సమయంలో తమ తమ నియోజకవర్గాల్లోనే ఉండి, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి ప్రయత్నాల వల్ల కష్టాల్లో ఉన్న ప్రజలకు సహాయ, సహకారాలు అందుతున్నాయని, ప్రభుత్వ కార్యక్రమాలతో సమన్వయం చేసుకొనేందుకు వీలు కలుగుతున్నదని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.