హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి ప్రధాన నీటి వనరులైన గోదావరి, కృష్ణా రివర్ బేసిన్లలో ఈ ఏడాది విచిత్ర పరిస్థితి నెలకొన్నది. ప్రతీ ఏటా తొలుత గోదావరిలో వరద ప్రవాహాలు మొదలైతే, జూలై చివరివారం లేదా ఆగస్టులో కృష్ణమ్మ ఉరకలెత్తేది. ఈ ఏడాది అందుకు భిన్నంగా మే చివరి వారం నుంచే కృష్ణమ్మ పరుగులు పెడుతున్నది. మరోవైపు ప్రాణహితలో తప్ప ప్రధాన గోదావరిలో ఇప్పటికీ వరద జాడ లేకుండాపోయింది. కర్ణాటక, మహారాష్ట్రతోపాటు రాష్ట్రంలోనూ విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మకు అప్పుడే ప్రవాహం పరవళ్లు తొక్కుతున్నది. జూన్ ప్రారంభం నుంచే ఎగువ నుంచి వరదనీరు వచ్చి చేరుతున్నది. కృష్ణా బేసిన్లో ప్రాజెక్టులన్నీ అప్పుడే జలకళను సంతరించుకుంటున్నాయి. కర్ణాటకలోని ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యానికి చేరువయ్యాయి. భారీగా వరద వస్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి దిగువకు జలాలను విడుదల చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యానికి చేరుకున్నాయి. ఇప్పటికీ ఎగువ నుంచి వరద కొనసాగుతున్నది.
వృథాగా దిగువకు ప్రాణహిత జలాలు
జూన్ మొదటి వారంలోనే గోదావరి బేసిన్లో వరద ప్రవాహం మొదలవుతుంది. కానీ జూలై చివరి వారం వచ్చినా కూడా వరద జాడ లేకుండా పోయింది. మహారాష్ట్ర అప్పర్ గోదావరిలో సైతం వరద ప్రవాహాలు లేకుండాపోయాయి. గోదావరి బేసిన్‌లోని ప్రధాన ప్రాజెక్టులన్నీ వెలవెలబోతున్నాయి. గోదావరి బేసిన్లో వస్తున్న వరద జలాలనూ కాంగ్రెస్ ప్రభుత్వం వృథాగా దిగువకు వదిలిపెడుతున్నది. ప్రధాన గోదావరిలో ఈ ఏడాది ఇప్పటికీ వరద ప్రవాహాలు ప్రారంభమే కాలేదు. ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, నిజాంసాగర్, మంజీరా, శ్రీరాజరాజేశ్వర జలాశయం, దిగువ మానేరు తదితర ప్రాజెక్టులన్నీ కనీస నీటి నిల్వలు లేక వెలవెలబోతున్నాయి. మిగిలింది ఆగస్టు, సెప్టెంబర్ నెలలు మాత్రమే. ఆ తర్వాత వరద వచ్చేది అంతంత మాత్రమేనని అంచనాలు చెప్తున్నాయి. ప్రస్తుతం ప్రాణహిత నుంచే భారీగా వరద ప్రవాహాలు కొన సాగుతున్నాయి. ఆ నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నది. మేడిగడ్డ బరాజ్ వద్ద గేట్లను మూయకుండానే నీటిని లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉన్నది. తద్వారా ఎల్లంపల్లి, నుంచి మిడ్‌మానేరు, అనంతసాగర్, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ వరకు జలాలను ఎప్పటికప్పుడు తరలించి నిల్వ చేసుకోవచ్చు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం చొరవ తీసుకోవడమే లేదు. ప్రాణహిత జలాలను దిగువకు వృథాగా విడుదల చేస్తున్నది. అదేమంటే అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను కూడా వినియోగించవద్దని ఎన్డీఎస్ఏ నివేదించిందని సాకుగా చూపుతున్నది.
కృష్ణాజలాల వినియోగంపై అదే నిర్లక్ష్యం
ఈ ఏడాది కృష్ణా బేసిన్లో మే నెలాఖరు నుంచే వరద ప్రవాహాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ వరద స్థిరంగా భారీగా కొనసాగుతున్నది. ఈసారి కృష్ణా జలాల వినియోగంలోనూ కాంగ్రెస్ సరారు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నది. వరదనీరు ఉప్పొంగుతున్నా జూరాలకు సంబంధించి కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, రాజీవ్ భీమా లిఫ్ట్‌లను, శ్రీశైలం వద్ద కల్వకుర్తి లిఫ్ట్‌లను ఆన్ చేయడమే లేదు. ఇప్పటివరకు ఏపీ అధికారికంగానే 23 టీఎంసీలు, అనధికారికంగా 100 టీఎంసీల జలాలను మళ్లించుకుపోయినా, తెలంగాణ సరారు మాత్రం కేవలం 3 టీఎంసీలనే వినియోగించిందంటే కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.
కృష్ణాలో నీటినిల్వ సామర్థ్యాన్ని నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన అంజనగిరి(నార్లాపూర్), అంజనాద్రి(ఏదుల), వెంకటాద్రి(వట్టెం), కురుమూర్తి(కరివెన), ఉద్దండపూర్ రిజర్వాయర్లను నిర్మించింది. మొత్తంగా ఆయా రిజర్వాయర్లలో 67 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చు. రిజర్వాయర్లన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఉద్దండపూర్ మినహా అన్నిచోట్ల పంపింగ్ సిస్టమ్ సిద్ధంగా ఉన్నది. నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్‌కు జలాలను తరలించే 8 కి.మీ, కాలు వ తవ్వకంలో 10% పనులే పెండింగ్‌లో ఉన్నాయి. కాంగ్రెస్ వచ్చి 20 నెలల కాలంలో ఆ పెండింగ్ కాలువ పనులను పూర్తిగా పకన పెట్టింది. దీంతో ప్రస్తుతం నీటిని ఎత్తిపోసుకోలేని దుస్థితి తెలంగాణకు వచ్చింది. కాంగ్రెస్ సర్కార్ కృష్ణాజలాలను సైతం ఏపీకి ధారధత్తం చేస్తున్నది. నిరుడు సైతం ఇలాగే జలాలను వదిలి, జూరాల కింద క్రాప్ హాలిడే ప్రకటించి, రైతులకు తీరని నష్టం చేకూర్చింది.
బీఆర్ఎస్ పార్టీకి పేరొస్తుందనే..
బీఆర్ఎస్ పార్టీకి పేరొస్తుందనే అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను కూడా కాంగ్రెస్ సర్కార్ వినియోగించడం లేదు. వాస్తవంగా ఆ రెండు బరాజ్‌ల్లో తొలుత రెండుచోట్లే నామమాత్రపు లీకేజీలు కనిపించాయి. అప్పుడే కెమికల్ గ్రౌటింగ్ నిర్వహించి లీకేజీలను సైతం అరికట్టారు. అయినా నీటినిల్వకు మాత్రం సర్కార్ ససేమిరా అంటున్నది. బరాజ్‌ల్లో ఇంకా లీకేజీలు ఏమైనా ఉన్నాయా? అనేది తెలియాలన్నా నీటిని నిల్వ చేయాల్సి ఉన్నది. అప్పుడే చేసిన గ్రౌటింగ్ సక్రమంగా ఉన్నదా? లేదా? అన్నది తెలుస్తుంది. ఇతర సాంకేతిక లోపాలు ఉన్నా గుర్తించవచ్చని అధికారులు వివరిస్తున్నారు. కానీ కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఎన్డీఎస్ఏ నివేదికనే సాకుగా చూపుతూ బరాజ్‌ల వినియోగానికి మోకాలడ్డుతున్నది. బీఆర్ఎస్పై కాళేశ్వరం పేరిట తాము చేసిన ఆరోపణలన్నీ కొట్టుకుపోతాయనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ సర్కార్ తీరని ద్రోహం చేస్తున్నదని రైతులే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఎగువ నుంచి వరద రాకుంటే, ఆ ప్రాజెక్టులు సైతం నిండకుంటే పరిస్థితి ఏమటని? నీటిపారుదల శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో ప్రధాన సాగునీటి వివరాలు