రవీంద్రభారతి, జనవరి 7: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న జలదోపిడీ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని, లేకుంటే దక్షిణ తెలంగాణ పూర్తిగా ఎడారిగా మారే ప్రమాదం ఉందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ హెచ్చరించారు. జలదోపిడీపై సమగ్రంగా చర్చించి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే దిశగా బీసీ సంక్షేమ సంఘం పోరాటం చేయనున్నట్టు వెల్లడించారు. బుధవారం బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘కృష్ణను మింగిండ్రు…గోదావరి మీద పడ్డరు’ అనే అంశంతో ఈ నెల 16న సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జలవనరుల రంగ నిపుణులు, మేధావులతో సమావేశాన్ని నిర్వహిస్తామని తెలిపారు.
పోలవరం, బనకచర్ల లిఫ్ట్ నుంచి పోలవరం-నల్లమల సాగర్ లిఫ్ట్ వరకు 424 టీఎంసీల జలదోపిడీకి చంద్రబాబునాయుడు ముందస్తూ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని, దీనికి కేంద్రప్రభుత్వం సహకారం అందిస్తున్న తీరుపై చర్చిస్తామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ నేతలు తక్షణమే ఆంధ్ర జలదోపిడీకి అడ్డుకట్టవేయాలని, లేకుంటే తెలంగాణ ప్రజలను మోసం చేసిన ద్రోహులుగా మిగిలిపోతారని ధ్వజమెత్తారు. నీళ్లు నిధులు, ఉద్యోగాల కోసమే తెలంగాణ సాధించుకున్నా.. ఆంధ్రపాలకుల జలదోపిడీ మాత్రం ఆగడంలేదని వాపోయారు. చంద్రబాబు, కేంద్ర పాలకుల కుయుక్తులు, కుట్రలు ఆపి తెలంగాణను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే తెలంగాణ ప్రజలు వారికి బుద్ధి చెప్పే రోజులు వస్తాయని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ జేఏసీ నాయకుడు వేముల రామకృష్ణ, బీసీ న్యాయవాది, జేఏసీ నేత నాగుల శ్రీనివాస్‌యాదవ్, నందగోపాల్ తదితరులు పాల్గొన్నారు.