హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర నీటిపారుదల శాఖలోని ఇంజినీర్ల బదిలీల్లో రిటెన్షన్ల దందా కొనసాగుతున్నది. పైరవీలు రాజ్యమేలుతున్నాయి. నచ్చినోళ్లకు మినహాయింపులు, నచ్చనోళ్లకు బదిలీలుగా లభిస్తున్నాయి. ఈ బదిలీలను తప్పించుకునేందుకు కొందరు సెన్సస్ డ్యూటీల కోసం ప్రయత్నాలు చేస్తుండగా, మరికొందరు ఇంజినీర్లు ఉన్నతాధికారులను పట్టుకుని రిటెన్షన్ సంపాదిస్తున్నారు. దీర్ఘకాలం నుంచి ఒకేచోట పనిచేస్తున్న ఈ ఇంజినీర్లు మళ్లీ అక్కడే తిష్ట వేసేందుకు సిద్ధమవుతుండటంతో మరికొందరు ఇంజినీర్లు మారుమూల ప్రాంతాల్లోనే మగ్గిపోవాల్సిన దుస్థితి నెలకొన్నది. కాంగ్రెస్ నేతల నుంచి విపరీతమైన ఒత్తిడి వస్తుండటంతో బదిలీలపై ఏం చేయాలో తెలియక ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు.
ఉద్యోగుల బదిలీలు చేపట్టేందుకు 2024 జూలైలో ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. వానకాలం నేపథ్యంలో ఆ బదిలీల నుంచి ఇరిగేషన్ శాఖను మినహాయించింది. దీంతో సాగునీటి పారుదల శాఖలో బదిలీలు నిలిచిపోయాయి. బదిలీల కోసం ఇటీవల ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఒకే స్టేషన్లో నాలుగేండ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న అన్ని ప్రభుత్వ శాఖల్లోని అధికారులను బదిలీ చేయాలని ఆదేశించింది. ఈ బదిలీల నుంచి మినహాయింపు కోసం పలువురు ఇంజినీర్లు తమ అధికారులను ప్రలోభపెట్టి రిటెన్షన్లు తీసుకొస్తున్నట్టు తెలుస్తున్నది. వాస్తవంగా కీలకమైన ప్రాజెక్టుల పనులు జరుగుతున్న ప్రాంతాలతోపాటు అత్యంత ప్రాధాన్యత కలిగిన విభాగాల్లో తగినంత సిబ్బంది, అనుభవజ్ఞులైన ఇంజినీర్లు ఉండాలి. సంబంధిత కార్యాలయాల ఉన్నతాధికారులు తమ అభిప్రాయాలతోపాటు వర్లోడ్, అనుభవమున్న ఉద్యోగుల అవసరాన్ని వివరిస్తూ పరిపాలనాపరమైన కారణాల రీత్యా బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతారు. వాటిని ప్రభుత్వం పరిశీలించి రిటెన్షన్ ఇస్తుంది. దీన్ని ఆసరాగా చేసుకుని ఒకే స్టేషన్లో దశాబ్దకాలం కంటే ఎక్కువగా కొనసాగుతున్న ఇంజినీర్లు సైతం రిటెన్షన్లు రాయించుకుంటున్నట్టు తెలుస్తున్నది. అవసరాల్లేని చోట కూడా పలువురు సీఈలు రిటెన్షన్లు ఇస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెంట్రల్ డిజైన్స్ ఆర్డనైజేషన్ (సీడీవో) విభాగంలో 10 నుంచి 15 ఏండ్లుగా పనిచేస్తున్న పలువురు ఇంజినీర్లతోపాటు ఆ విభాగంలోని మొత్తం సిబ్బందికి ఇదే సాకుతో బదిలీల నుంచి మినహాయింపులు ఇవ్వడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నది. సచివాలయంలోని పేషీ కార్యాలయంలో కూడా దాదాపు అందరికీ రిటెన్షన్లు కల్పించి బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చినట్టు సమాచారం. లాంగ్ స్టాండింగ్ జాబితాలో లేని ఇతర ఇంజినీర్లకు అలాంటి రిటెన్షన్లు కేటాయించకపోవడం గమనార్హం.
బదిలీల నుంచి మినహాయింపుల కోసం పలువురు ఇంజినీర్లు రాజకీయనేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పలుకుబడి కలిగిన నేతల నుంచి సిఫార్సు లేఖలు పట్టుకొచ్చి ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తున్నది. బదిలీల నుంచి మినహాయించాలని కోరుతూ నేరుగా పేషీల నుంచే సిఫార్సులు వస్తున్నాయని, దీంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని జలసౌధలోని ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు.
బదిలీల ప్రక్రియపై పలువురు ఇంజినీర్లు రగిలిపోతున్నారు. ఇతర లాంగ్ స్టాండింగ్ ఉద్యోగులకు కూడా రిటెన్షన్లు ఇవ్వడం వల్ల ఫీల్డ్ కార్యాలయాల్లో పనిచేస్తున్న అర్హులైన ఇంజినీర్లు సీడీవో, ఈఎన్సీ అడ్మిన్, ఇతర విభాగాల్లో పనిచేసే అవకాశాన్ని కోల్పోతున్నారని చెప్తున్నారు. కొందరు సీఈలు, ఉన్నతాధికారుల తీరు వల్ల ఫీల్డ్ కార్యాలయాల్లో పనిచేస్తున్న ప్రతిభావంతులైన, అర్హులైన ఇంజినీర్లకు సచివాలయం, ఈఎన్సీ కార్యాలయాల్లో పనిచేసే అవకాశాలు దూరమవుతున్నాయని, ఇది దీర్ఘకాలంలో ఇరిగేషన్ శాఖ పనితీరుపై దుష్ప్రభావాన్ని చూపుతుందని పేర్కొంటున్నారు. దీనిపై ప్రభుత్వం, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించాలని, రాజకీయ ప్రమేయాన్ని నిరోధించి నిబంధనల మేరకే బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. సీఈలు ఇచ్చే ప్రతి రిటెన్షన్ను క్షుణ్ణంగా పరిశీలించాలని, అవసరాల్లేకున్నా మినహాయింపులు ఇస్తున్న అధికారులపై చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అనుభవజ్ఞులకు, సుదీర్ఘకాలంగా ఫీల్డ్ స్థాయిల్లో పనిచేస్తున్న ఇంజినీర్లకు హైదరాబాద్లో, ఇతర విభాగాల్లో పనిచేసే అవకాశం కల్పించాలని ఇంజినీర్లు కోరుతున్నారు.