హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : ఎల్ నినో ప్రభావంతో ఇప్పటివరకు సరియైన వర్షాలు కురవకపోవడంతో రాష్ట్రంలో నీటి ఎద్దడి ఛాయలు ప్రారంభమయ్యాయి. జూన్ మాసం ముగిసి జూలై సగానికి వచ్చినప్పటికీ పెద్ద వర్షాలు పడకపోవడంతో నీటి నిల్వలు మరింత అడుగంటిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన రిజర్వాయర్లతోపాటు మిషన్‌భగీరథ రిజర్వాయర్లు సైతం డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. మరోవైపు భూగర్భజలాలు సైతం అంతకంతకూ పడిపోతున్నాయి. రాబోయే రోజుల్లో వర్షాలు కురువలేదంటే తాగునీటికి తీవ్రస్థాయిలో తిప్పలు తప్పని పరిస్థితి. ఇప్పటికే అనేక ఆవాసాలకు వారానికి ఒకసారి నీటిని సరఫరా చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. వరద ప్రవాహాలు ఏమీ రాకుంటే తాగునీటి విషయంలో మున్ముందు పరిస్థితి మరింత దయనీయంగా మారనున్నదని అర్థమవుతున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.
మిషన్‌భగీరథ పథకం కింద రాష్ట్రంలోని పలు మేజర్, మీడియం కలిపి మొత్తంగా 26 ప్రాజెక్టులు ఉన్నాయి. ఆయా ప్రాజెక్టుల వద్ద మిషన్‌భగీరథ యూనిట్లను ఏర్పాటుచేసి నిత్యం 33 జిల్లాల ప్రజలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం సదరు జలాశయాలన్నీ అడుగంటిపోతున్నాయి. ఇప్పటికే డెడ్‌స్టోరేజీకి చేరబోతున్నాయి. రాబోయే రోజుల్లో వరద రాకుంటే రాష్ట్రవ్యాప్తంగా తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదరయ్యే ప్రమాదం పొంచి ఉన్నది. ఇక గోదావరి నది పరీవాహకంలోని ప్రధాన జలశయాలన్నీ అడుగంటిపోయాయి. ఎస్సారెస్పీ ప్రాజెక్టులో డెడ్ స్టోరేజీకి మీదుగా 3 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
ప్రాజెక్టు నుంచి తాగునీటి అవసరాలకు ప్రతినెలా అర టీఎంసీ నీళ్లు అవసరం. ఎగువ నుంచి వరద రాకపోతే ప్రాజెక్టు కింద తాగునీటి కష్టాలు తప్పని పరిస్థితి నెలకొన్నది. కరీంనగర్, వరంగల్‌కు ప్రధాన తాగునీటి వనరైన ఎల్ఎండీలోనూ ఇప్పటికే పరిస్థితి దారుణంగా ఉన్నది. ఎల్లంపల్లిపై ఆధారపడి హైదరాబాద్‌తోపాటు రామగుండం, మంచిర్యాల, పెద్దపల్లికి తాగునీటి అవసరాలున్నాయి. కడెం ప్రాజెక్టుపై కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా, అవసరాలు ఆధారపడి ఉన్నాయి.
జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుపై ఆధారపడి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా, నాగార్జునసాగర్‌పై ఆధారపడి హైదరాబాద్, ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, నిజాంసాగర్‌పై కామారెడ్డి, సింగూరుపై మెదక్, సంగారెడ్డి తదితర ప్రాంతాల తాగునీటి అవసరాలు ఆధారపడి ఉన్నాయి. మిషన్‌భగీరథలో భాగమైన కోయిల్‌సాగర్, రామన్‌పాడు, అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, వైరా, పెండ్లిపాకల, ఉదయసముద్రం, గోపాలదిన్నె, శంకరసముద్రం, కుమ్రంభీం, మేడారం, భీమ్‌ఘన్‌పూర్, ధర్మసాగర్, చలివాగు తదితర ప్రాజెక్టులున్నాయి. అవి ఇప్పటికే డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి.
ఒకవైపు ఎల్ నినో నేపథ్యంలో ఇప్పటికీ వానలు కురువడం లేదు. కృష్ణా, గోదావరిలో ఎగువ నుంచి వరద ప్రవాహాలు సైతం రావడం లేదు. మరోవైపు ప్రధాన రిజర్వాయర్లు, మిషన్‌భగీరథ రిజర్వాయర్లు డెడ్‌స్టోరేజీకి చేరుకున్నాయి. తాగునీటి సరఫరాకు ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కానీ, ప్రభుత్వం మాత్రం నివారణ చర్యలపై దృష్టి సారించడం లేదు. ప్రాణహిత జలాలను ఒడిసిపట్టి గోదావరి బేసిన్‌లోని ప్రధాన రిజర్వాయర్లను నింపడంతోపాటు మిషన్‌భగీరథ అవసరాలను తీర్చుకునేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయినప్పటికీ రేవంత్‌రెడ్డి సర్కార్ రాజకీయ దురుద్దేశంతో జలాలను ఎత్తిపోయకుండా ప్రాజెక్టును పడావు పెడుతున్నది.
మరోవైపు కృష్ణాలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. గతేడాది శ్రీశైలం నుంచి ఏపీ యథేచ్ఛగా కృష్ణా జలాలను తరలించుకుపోయినా రేవంత్‌రెడ్డి సర్కార్ నోరు మెదపలేదు. ఇప్పుడు నీళ్లు అడుగంటి కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పొరుగున కర్ణాటక, మహారాష్ట్ర నుంచి నీళ్లను కోరుతామని హడావుడి చేసింది. కానీ, ఇప్పటికీ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాగునీటి సరఫరాలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై ఎలాంటి ప్రణాళికలు రూపొందించలేదు. మొత్తంగా ప్రభుత్వ నిర్లక్ష్యంతో తాగునీటికి ఈ ఏడాది తండ్లాట తప్పదని నీటిరంగనిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

