హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో తాగునీటి కటకట రోజురోజుకూ తీవ్రమవుతున్నది. వానకాలం ప్రారంభమై నెలన్నర దాటినా రిజర్వాయర్లన్నీ డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. మరోవైపు భూగర్భజలాలు సైతం నెలకు మీటర్ చొప్పున లోతుకు పడిపోతున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో తాగునీటికి తిప్పలు తప్పేలా లేవు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో తాగునీటికి ట్యాంకర్లు దిక్కయ్యాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలకు ఉపక్రమించలేదు. గోదావరి బేసిన్లో మిషన్ భగీరథ కింద మేజర్, మీడియం కలిపి మొత్తంగా 20 రిజర్వాయర్లు ఉన్నాయి. అందులో ఎస్సారెస్పీ, సింగూరు, ఎల్లంపల్లి, ఎల్ఎండీ, ఎంఎంఆర్ సహా మేడారం, గడ్డెన్నవాగు,
కడెం, కుమ్రం భీం, రామప్ప, గణపురం, దుమ్ముగూడెం, అలీసాగర్ ప్రాజెక్టులున్నాయి. వాటి వద్దే ఇన్‌టెక్ పాయింట్లను ఏర్పాటు చేసి, ట్రీట్మెంట్ ప్లాంట్లకు తరలించి బేసిన్లో పరిధిలోని 15 జిల్లాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నాయి. ఎల్లంపల్లి డెడ్ స్టోరేజీకి చేరడంతో హైదరాబాద్‌కు ముప్పు పొంచి ఉన్నది. బేసిన్‌లోని 20 రిజర్వాయర్ల పరిధిలో నెలకు 3.26 టీఎంసీలు తాగునీటి అవసరాలకు అవసరం. రాబోయే జూలై వరకు తాగునీటి అవసరాలకు 39.12టీఎంసీలు అవసరం. ప్రభుత్వ లెక్కల ప్రకారమే.. ప్రస్తుతం గోదావరి బేసిన్లో ఆయా ప్రాజెక్టుల కింద అందుబాటులో ఉన్నవి 27.69 టీఎంసీలు మాత్రమే. 11.43 టీఎంసీల లోటు ఉన్నది.
తాగునీటి అవసరాలు పెరిగే అవకాశం..
వానలు కురువకపోవడం, రిజర్వాయర్లు అడుగంటడంతో రాష్ట్రవ్యాప్తంగా భూగర్భజల మట్టాలు పడిపోతున్నాయి. గతంలో ఇదే సమయంలో రాష్ట్ర సగటు భూగర్భ జలమట్టం 6.22మీటర్లు. ప్రస్తుతం 9.34మీటర్లకు చేరుకోవడం ప్రమాదకర పరిస్థితికి అద్దం పడుతున్నది. బేసిన్‌లోని ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, జనగామ, మంచిర్యాల, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, సంగారెడ్డి, తదితర జిల్లాల్లో భూగర్భ జలమట్టం అంతకంతకూ పడిపోతున్నది. ఒకే నెలలో పెద్దపల్లి జిల్లాలో 1.40 మీటర్ల మేరకు పడిపోవడం గమనార్హం. భూగర్భ జలమట్టాన్ని పెంచడంలో చెరువులు, కాలువలు, ప్రాజెక్టులు, చెక్‌డ్యామ్‌లు, పెరోలేషన్ రీచార్జ్ నిర్మాణాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఆయా మార్గాల ద్వారా నీటి సరఫరా లేకపోవడంతో రైతాంగం పూర్తిగా భూగర్భ జలాలమీదనే ఆధారపడుతున్నది.
కరువు తీర్చే అవకాశమున్నా..
గోదావరి బేసిన్లో నీటికొరతను తీర్చేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. ప్రాణహిత నుంచి కన్నెపల్లి మీదుగా ఇప్పటికే 88 టీఎంసీలు దిగువకు వృథాగా వెళ్లాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా కీలకమైన మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్ ఎగువ కన్నెపల్లి పంపులను ఆన్ చేస్తే ప్రాణహిత జలాలను ఒడిసిపట్టవచ్చు. మేడిగడ్డ నుంచి అన్నారం, అన్నారం నుంచి సుందిళ్ల, సుందిళ్ల నుంచి గోదావరిపై నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు జలాలను తరలించుకోవచ్చు. ఎల్లంపల్లి నుంచి నందిమేడారం, లక్ష్మీపూర్, రాజన్న సిరిసిల్ల జిల్లా రాజరాజేశ్వర జలాశయం, అక్కడి నుంచి అనంతగిరి (అన్నపూర్ణ) రిజర్వాయర్, రంగనాయకసాగర్, కొమురవెల్లి మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్ వరకు జలాలను తరలించుకోవచ్చు. వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీకి, మల్లన్నసాగర్ నుంచి కూడవెల్లి వాగులోకి జలాలను విడుదల చేసి అప్పర్మానేరుకు, కొండపోచమ్మసాగర్ ద్వారా హల్దీవాగులోకి జలాలను విడుదల చేస్తే నిజాంసాగర్‌కు తరలించుకోవచ్చు. అందుకు కావాల్సిన నీటిసరఫరా వ్యవస్థ సంసిద్ధంగా ఉన్నది. ఆయా జిల్లాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటికి ఢోకా లేకుండా చేయడమేకాదు.. సాగునీటిని సైతం అందించే వెసులుబాటు ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వరదను ఒడిసిపట్టేందుకు నిరాకరిస్తున్నది. ఎన్డీఎస్ఏ నివేదికను సాకుగా చూపుతూ, రాజకీయాల కోసం జలాలను దిగువకు వదిలివేస్తున్నది. రాష్ర్టాన్ని మరింత నీటి సంక్షోభంలోకి నెడుతున్నది.
