హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈ -పంచాయతీల లక్ష్యం నీరుగారుతున్నది. ప్రతి గ్రామానికీ ఈ-గవర్నెన్స్ ఆశయం చతికిల పడింది. గ్రామీణ ప్రజలకు పలు సేవలను పారదర్శకంగా, సమర్థంగా అందించడం కోసం ఈ-పంచాయతీ పోర్టల్‌ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. గ్రామీణ ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా, తమ గ్రామంలోనే డిజిటల్ కేంద్రాల ద్వారా అవసరమైన సేవలు పొందాలని నిర్దేశించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి ఒక్క పంచాయతీకి కూడా కొత్త కంప్యూటర్ సమకూర్చకపోవడంతో డిజిటల్ పంచాయతీ పాలన పడకేసింది. ప్రతి సర్టిఫికెట్ కోసం ప్రజలు మండలకేంద్రానికి పరుగులు తీయాల్సి పరిస్థితి ఏర్పడుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా 12,777 గ్రామ పంచాయతీలు ఉండగా, వీటిల్లో 1,000 గ్రామ పంచాయతీల్లోనే కంప్యూటర్లు ఉన్నాయి.
ఇంటి నిర్మాణ అనుమతులు, ఆస్తి రిజిస్ట్రేషన్, జనన-మరణ, వివాహ ధ్రువీకరణ పత్రాలు, ఇంటి పన్ను, వాణిజ్య లైసెన్స్‌లు వంటి సేవలను ఈ-పంచాయతీ పోర్టల్ ద్వారా అందిస్తున్నారు. 92% గ్రామాల్లో కంప్యూటర్లు, ఇంటర్నెట్ వసతి కల్పించకపోవడంతో ప్రజలు పౌరసేవలకు మండలకేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ఈ-పంచాయతీ పోర్టల్‌లో ఎడిట్ ఆప్షన్ లేకపోవడం వల్ల ఆస్తి రిజిస్ట్రేషన్‌లో తప్పులను సరిచేయడం కష్టంగా ఉన్నది. గత ప్రభుత్వం నాన్-ప్రాపర్టీ బుక్‌లో ఇండ్లు, వ్యవసాయేతర భూముల వివరాలను నమోదు చేయించినప్పటికీ, సాంకేతిక లోపాలు ఈ ప్రక్రియను జఠిలం చేస్తున్నాయి. రేవంత్ సర్కారు గ్యారెంటీ పథకాల కోసం దరఖాస్తులను ఆన్లైన్, ఆప్‌లైన్‌లో స్వీకరిస్తున్నది. ప్రతి గ్రామానికీ ఈ-గవర్నెన్స్ లేకపోవడంతో మండలకేంద్రంలోని ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాలను ఆశ్రయించాల్సి వస్తున్నది.