హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తేతెలంగాణ): “అక్రమ నిర్బంధాలు, అరెస్టులే ఇందిరమ్మ రాజ్యమా? ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగినవారిపై దాడులకు దిగడమే ప్రజాపాలనా? అణచివేతలు, దౌర్జన్యాలు చేయడమే రేవంత్ సర్కారు తెచ్చిన మార్పా?” అని బీఆర్ఎస్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ ప్రశ్నల వర్షం కురిపించారు. సీఎం రేవంత్ పర్యటనకు వెళ్లిన చోటల్లా ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడం దుర్మార్గమని నిప్పు లు చెరిగారు. రేవంత్ కామారెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, జాజాల సురేందర్‌ను గృహ నిర్బంధంలో ఉంచడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
గురువారం తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ నేతలు పల్లె రవికుమార్‌గౌడ్, గాంధీనాయక్, బొమ్మెర రామ్మూర్తితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆచరణ సాధ్యం కానీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు తప్పించుకొనేందుకు అణచివేతను అవలంబిస్తున్నదని విమర్శించారు. ఓయూలో కేసీఆర్ స్టిక్కర్ పెట్టుకున్న విద్యార్థి నేత కారును పోలీసులు స్వాధీనం చేసుకోవడాన్ని ఖండించారు.
పోలీసులు లేకుండా ఓయూకు వస్తానని చెప్పిన రేవంత్ కామారెడ్డిలో బీఆర్ఎస్ నేతలపై పోలీసులను ఎందుకు ప్రయోగించారని ప్రశ్నించా రు. ఎన్ని నిర్బంధాలు పెట్టినా గ్యారెంటీలు అమలు చేసే వరకు పోరాడతామని హెచ్చరించారు. పీఆర్సీ, పింఛన్ల కోసం ఉద్యోగులు, ఖాళీలు భర్తీ చేయాలని నిరుద్యోగులు, యూరి యా కోసం అన్నదాతల ఆందోళనలతో రాష్ట్రం అట్టడుకుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
తెలుగుదేశం అద్భుత పార్టీ అని చెప్తున్న రేవంత్‌రెడ్డి మరి ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో ఎందుకు చేరారని దేవీప్రసాద్ ప్రశ్నించారు. నాడు తెలంగాణ వాదులపై తుపాకి ఎక్కుపెట్టిన రేవంత్ ఏనాడూ జై తెలంగాణ అనలేదని ఆక్షేపించారు. సీబీఐ విషయంలోనూ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించారు. సురవరం సుధాకర్‌రెడ్డి సంస్మరణ సభలో మోదీ జేబు సంస్థ అని చెప్పిన రేవంత్‌రెడ్డి 24 గంటలు తిరగకముందే ఎందుకు మనసు మార్చుకున్నారని ప్రశ్నించారు. కాళేశ్వరం విచారణను మోదీ కాళ్ల దగ్గర తాకట్టుపెట్టారని ధ్వజమెత్తారు.
పార్టీ గీత దాటారని భావించడం వల్లే అధినేత కేసీఆర్ కవితపై సస్పెన్షన్ వేటు వేశారని దేవ్రీప్రసాద్ స్పష్టంచేశారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి ప్రాంతీయ పార్టీల్లో చిచ్చుపెడుతున్నాయని ఆరోపించారు. పార్టీకి అంబులెన్స్ లాంటి హరీశ్‌రావుపై అర్థంపర్థంలేని ఆరోపణలు చేయడం దురదృష్టకరమని అన్నారు. కాళేశ్వరంలో అవినీతిని ఏజెన్సీలు, ప్రభుత్వం వేసిన కమిషన్లే తేల్చలేదని, కవిత లాంటి వ్యక్తి తేలుస్తారా? అని ప్రశ్నించారు.
పోలీసు పహారాలో పర్యటనలు, పోలీస్ కమాండ్ సెంటర్ నుంచి పాలన నడుపుతున్న రేవంత్‌రెడ్డి 21 నెలల్లో సాధించిందేమీలేదని బీఆర్ఎస్ నేత పల్లె రవికుమార్‌గౌడ్ దెప్పిపొడిచారు. బీఆర్ఎస్పై బురదజల్లడం, 420 హామీలు ఎగ్గొట్టడం తప్ప ఒరగబెట్టిందేమీలేదని నిప్పులు చెరిగారు. అలాంటి వ్యక్తి బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుందని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. వెయ్యి మంది రేవంత్‌రెడ్డిలు వచ్చినా బీఆర్ఎస్ను ఏమీచేయలేరని తేల్చిచెప్పారు.